శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (12:02 IST)

పిలవని పేరంటానికి వచ్చారు.. పెళ్లికొడుకు మేనమామపై కాల్పులు

పెళ్లికి పిలవలేదనే కోపంతో ముగ్గురు యువకులు పెళ్లికొడుకు మేనమామపై కాల్పులు జరిపిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బిలారా అనే గ్రామంలో షేర్ సింగ్ కుహ్వాహా మేనల్లుడి పెళ్లి జరుగుతోంది. ఆ వివాహానికి గ్రామంలోని అందరినీ ఆహ్వానించారు. కానీ, హరేంద్ర సింగ్, బాలి, గుడ్డు రానాలను మాత్రం ఆహ్వానించలేదు. ఆ ముగ్గురు ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో నిషాలో తూగుతూ ఉండడంతో వారిని పెళ్లికి పిలవలేదు. 
 
అయితే తమను పెళ్లికి పిలవకపోయినా ఆ ముగ్గురు గత మంగళవారం జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పిలవని పేరంటానికి వచ్చినా కూడా పెళ్లికొడుకు కుటుంబసభ్యులు ఎవరూ వారిని ఏమీ అనకుండా స్వాగతించారు. పెళ్లికి హాజరైన ఆ ముగ్గురు భోజనం పూర్తయ్యాక తమతో తెచ్చుకున్న గన్‌తో పెళ్లికొడుకు మేనమామ మీద కాల్పులు జరిపారు. 
 
హరేంద్ర సింగ్ రానా గన్‌తో కాల్పులు జరుపుతుంటే, మిగిలిన ఇద్దరూ పక్కనే ఉన్నారు. కాల్పులు అనంతరం వారంతా పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నిందితుల కోసం గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.