శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (14:35 IST)

కరోనా రోగితో వెళ్తున్న ఆంబులెన్స్‌ను ఆపి.. ఆ డ్రైవర్ చెరకు రసం తాగాడు..(video)

కరోనా రోగుల కోసం నడిపే ఓ ఆంబులెన్స్ డ్రైవర్ చేసిన పని విమర్శలకు దారి తీస్తుంది. ఓ కరోనా అనుమానంతో ఉన్న రోగితో వెళ్తున్న అంబులెన్స్‌ను చెరుకు రసం బండి వద్ద ఆపి ముఖానికి మాస్కు లేకుండా నిల్చున్నాడు డ్రైవర్. ఆ అంబులెన్స్‌లో బెడ్‌పై పడుకుని ఉన్న రోగికి కరోనా ఉండగా.. నిర్లక్ష్యంగా రోడ్డుపై ఆంబులెన్స్‌ను ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్‌తో పాటు మరో ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్ ధరించి ఉండగా.. కరోనా అనుమానిత వ్యక్తి అంబులెన్స్ వెనుక భాగంలో బెడ్‌పై పడుకొని ఉన్నాడు.
 
ఈ ఘటన మధ్యప్రదేశ్ శాదూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పీపీఈ కిట్ ధరించి ఉన్న డ్రైవర్ అంబులెన్స్ దిగి ఫోన్‌లో లీనమైపోగా.. అక్కడే ఉన్న ఓ యువకుడు ముఖానికి మాస్కు ధరించాలని సూచించాడు. కరోనా పేషెంట్‌తో వెళ్తున్న అంబులెన్స్ ఇక్కడ ఎందుకు ఆపారని ప్రశ్నించాడు. యువకుడు ప్రశ్నిస్తున్న సమయంలో కూడా మాస్కు వేసుకోలేదు డ్రైవర్.. వీడియో తీస్తున్నాడన్న విషయాన్నీ గమనించి మాస్కు సరిచేసుకున్నాడు. ఈ సమయంలోనే డ్రైవర్ మాట్లాడే ప్రయత్నం చేశాడు.
 
అప్పుడు ఆంబులెన్స్‌లో ఉన్నది కరోనా రోగి కాదని వేరే ఇతర సమస్యలు ఉన్న వ్యక్తి అని, ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని తెలిపాడు. నీరసంగా ఉందని రోగి చెప్పడంతో చెరుకు రసం కోసం ఆపామని చెప్పుకొచ్చాడు డ్రైవర్. అయితే డ్రైవర్ పీపీఈ కిట్లో ఉండడంతో జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతంలో అంబులెన్స్ నిలపడం విమర్శలకు తావిస్తుంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టారు.