అక్షయ తృతీయ: జాతిపిత గాంధీజీ బొమ్మతో బంగారం నాణేలు!
అక్షయ తృతీయను అందరూ ఘనంగా జరుపుకొంటారు. ఆరోజు స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని విశ్వాసం. అలాంటి అక్షయ తృతీయను పురస్కరించుకుని జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మతో కూడిన బంగారు నాణేలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.
ఓ వైపు మహాత్ముడి బొమ్మ, మరోవైపు జాతీయ చిహ్నమైన అశోక చక్రం బొమ్మతో కూడిన మహాత్మా గాంధీ బంగారు నాణేలను విడుదల చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 24 క్యారెట్లు స్వచ్ఛత కలిగిన బంగారంతో తయారు చేసిన వీటిపై బీఐఎస్ హాల్‌మార్క్ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం కొనుగోళ్లు భారీగా పుంజుకుంటాయి. అయితే ఈసారి ఆ పరిస్థితులేమీ కనబడట్లేదు. పసిడి ధరలు అంచనాలకుమించి పుంజుకుంటున్న నేపథ్యంలో ఈసారి కొనుగోలు దారులు పెద్దగా ఆసక్తి చూపే అవకాశాలు కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.