ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:47 IST)

బీజేపీ హింసాత్మక, హంతక పార్టీ: మమతా

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  బీజేపీతో సంబంధం ఉన్న వారిని ముట్టుకోవడానికి కూడా తమ కార్యకర్తలు ఇబ్బంది పడతారని అన్నారు. 

బీజేపీని హింసాత్మక, హంతకపార్టీగా అభివర్ణించిన మమత.. తృణమూల్ కాంగ్రెస్ గూండాల పార్టీ కాదన్నారు. తన కాళీఘాట్‌ నివాసానికి సమీపంలో పార్టీ కార్యకర్త మృతదేహంతో బీజేపీ గురువారం ఆందోళనకు దిగడంపై మమత మండిపడ్డారు.

‘‘ఎన్నికల తర్వాత చాలా నెలలకు బీజేపీ కార్యకర్త మరణించినట్టు తెలిసింది. ఇలాంటివి దురదృష్టకరం. వారు ఆ మృతదేహంతో నా ఇంటికి వచ్చారు. ఎన్ఆర్‌సీ కారణంగా అస్సాంలో ఎంతోమంది చనిపోయారు. మీకు సిగ్గనిపించడం లేదూ? బీజేపీ పాలనలో చట్టమంటూ ఏమీ ఉండదా?’’ అని మమత విరుచుకుపడ్డారు.

జాతీయ పౌర రిజిస్టర్ ప్రచురణ నేపథ్యంలో అసోంలో చోటుచేసుకున్న మరణాలపై బీజేపీ నేతలను మమత టార్గెట్ చేసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చట్టమంటూ ఏదీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారం ఉప ఎన్నికలు జరగనున్న భవానీపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.