సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (16:44 IST)

ఎక్కువ మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతాం.. విశ్వరూపం చూపించిన KTR

రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సహా కాంగ్రెస్, బీజేపీల బహిరంగ సభలపై సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిని తిడితే బట్టలూడదీసి కొడతామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. రాష్ట్రాన్ని పొగిడితే జాతీయ నాయకున్ని గాడిద అన్న రేవంత్ రెడ్డి.. అడ్డ గాడిదనా.. నిలువు గాడిదనా అంటూ ఘాటైన వ్యాఖ్యలతో తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. 
 
సీఎం ఇలాకా గజ్వేల్‌లో సభ పెట్టామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోందని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొందరు నేతలు ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా తిడుతున్నారని, నోరు ఉందికదా అని తిడితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కువ మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. 
 
ఎవరెవరి అక్రమ సంపాదన ఏంటో తమకు అన్నీ తెలుసునన్న కేటీఆర్.. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామన్నారు.  తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ మతం రంగు పులుముతోందని ఆ పార్టీ తీరును తూర్పారబట్టారు మంత్రి కేటీఆర్. 
 
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నిర్మల్ పర్యటనలో మతం రంగుతో మాట్లాడారని విమర్శించారు. తెలంగాణపై, తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే రాజద్రోహం కేసులు కూడా పెడతామన్నారు.