ఇంట్లో చీరకట్టలేదని విడాకులు ఇవ్వాలనుకున్నాడు.. కానీ కోర్టుకు వెళ్లాక?
పూణేలో మోడ్రన్ దుస్తులే ధరిస్తుందని.. ఇంట్లో చీర కట్టలేదని.. ఓ భర్త భార్యకు విడాకులిచ్చేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పూణేలో రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఓ వ్యక్తి తన తల్లితో కలిసి.. మోడ్రన్ దుస్తులు ధరించే తన భార్యను వేధించసాగాడు. ఇంటాబయటా సంప్రదాయ దుస్తులే ధరించాలని షరతులు విధించేవాడు.
ఇంట్లో కూడా చీర కట్టాలని నియమాలు విధించేవాడు. కానీ ఇంట్లో వున్నప్పుడు చీరలు కట్టడం సౌకర్యంగా వుంటుందని భార్య చెప్పినా.. అతను వినిపించుకునేవాడు కాదు. దీంతో భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధలతో వీరిద్దరూ తాత్కాలికంగా విడిపోయారు. ఇలా భర్త వేధింపులకు గురైన మహిళ ఇంటి నుంచి వెళ్లేటప్పుడు గర్భంతో వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో చీరలు కట్టకుండా.. మోడ్రన్ దుస్తులు ధరించే భార్యను విడిపించుకోవాలని ఆ భర్త నిర్ణయించాడు. ఇందులో భాగంగా పూణే శివాజీ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశాడు. చీర కట్టలేదని భార్యపై కోపంగా వుండిన భర్త.. కోర్టుకు వచ్చిన వెంటనే మనసు మార్చుకున్నాడు.
కోర్టుకు తన భార్య చీరతో రావడంతో పాటు చేతిలో బిడ్డతో కనిపించడంతో వారిద్దరినీ ఆలింగనం చేసుకున్నాడు. భార్యాబిడ్డలతో ఇంటికి చేరాడు. ఇలా భార్యాభర్తలు మళ్లీ ఒక్కటయ్యారని పోలీసులు తెలిపారు.