మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?
ఛత్తీస్‌గఢ్ - ఒరిస్సా సరిహద్దుల్లో తాజాగా నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో (ఎన్‌కౌంటరు)లో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మవోయిస్టు అగ్రనేత చలపతి కూడా ఉన్నారు. ఈయన కొన్ని దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకుంటూ వచ్చారు. కానీ, తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో దిగిన సెల్ఫీ ఆయన ప్రాణాలు హరించేలా చేసింది.
గత 2008 ఫిబ్రవరిలో ఒరిస్సా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లాలో జరిగిన దాడిలో 13 మంది పోలీసులు మృతి చెందారు. ఈ ఘటన మాస్టర్ మైండ్ చలపతిగా గుర్తించిన పోలీసులు అతని తలపై ఒక కోటి రూపాయల వరకు రివార్డు ప్రకటించారు. అయితే చలపతి ఎలా ఉంటాడో చాలా రోజుల వరకు బయటకు తెలియరాలేదు. 2016 వరకు అతని ఫొటోలు పోలీసులకు లభించలేదు.
చలపతి భార్య అరుణ కూడా మావోయిస్టు. అరుణ ఆంధ్ర - ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్‌తో పని చేసింది. ఆ సమయంలో తన భర్తతో సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీయే చలపతి రూపురేఖలను గుర్తించడంలో పోలీసులకు సహాయపడింది.
అరుణ తన భర్త చలపతితో దిగిన సెల్ఫీని సోదరుడైన ఆజాద్‌కు పంపించింది. 2016లో ఏపీలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఆజాద్ చనిపోయాడు. ఆజాద్ స్మార్ట్ ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. అప్పుడే చలపతి ఎలా ఉంటాడనే విషయం తెలిసింది. పోలీసులు అతని తలకు కోటి రివార్డును ప్రకటించారు.
చలపతి చిత్తూరు వాసి. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో సీనియర్ సభ్యుడు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అతను చురుగ్గా ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్లు పెరుగుతుండటంతో కొన్ని నెలల క్రితం తన స్థావరాన్ని మార్చుకున్నాడు. అతను ఒడిశా బార్డర్‌కు వచ్చాడు. చలపతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాడని పోలీసులు గుర్తించారు.