బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 మే 2024 (12:54 IST)

కీలక నిర్ణయం తీసుకున్న మాయావతి... మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌పై వేటు!!

mayawati
బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఆగ్రహం వచ్చింది. సొంత మేనల్లుడిపై మండిపడ్డారు. అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై వేటు వేశారు. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి దూరంగా పెడుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. 29 ఏళ్ల ఆకాశ్ ఆనంద్ సంపూర్ణ పరిపక్వత చెందే వరకు అతడిని బాధ్యతలకు దూరం పెడుతున్నట్టుగా ఆమె స్పష్టం చేశారు.
 
'బాబా సాహెబ్ డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ పాటుపడిన అణగారిన వర్గాల ఆత్మగౌరవం, కాన్షీరామ్ కోరుకున్న సామాజిక మార్పులో బీఎస్పీ కూడా ఒక ఉద్యమం లాంటిది. అందుకోసం నేను నా జీవితమంతా అంకితం చేశాను. ఈ ఒరవడిని కొనసాగించడానికి నవతరం కూడా సిద్ధమవుతోంది' అంటూ ఎక్స్ వేదికగా మాయావతి స్పందించారు.
 
ఈ క్రమంలోనే పార్టీలో ఇతర వ్యక్తులను ప్రోత్సహించినట్టుగానే ఆకాష్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా, నా వారసుడిగా ప్రకటించాను. అయితే పార్టీ, ఉద్యమ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అతడిని ఈ రెండు ముఖ్యమైన బాధ్యతల నుంచి దూరం పెడుతున్నాను. సంపూర్ణ పరిపక్వత పొందే వరకు దూరంగా ఉంటాడు అని రెండవ ట్వీట్లో ఆమె పేర్కొన్నారు. ఇక ఆకాశ్ ఆనంద్ ఆనంద్ కుమార్ పార్టీలో అతడి బాధ్యతలను కొనసాగిస్తారని మరో ట్వీట్లో మాయవతి స్పష్టం చేశారు.
 
కాగా ఇటీవలే బీజేపీని ఉద్దేశిస్తూ ఆకాశ్ ఆనంద్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండడంతో పోలీసులు అతడిపై కేసు నమోదైంది. కేసు నమోదైన కొన్ని రోజులకు మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం బుల్ డోజర్ గవర్నమెంట్ అని, దేశద్రోహుల ప్రభుత్వమని ఆకాశ్ ఆనంద్ ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. 
 
యువతను ఆకలితో వదిలి పెట్టి వృద్ధులను బానిసలుగా మార్చుకున్న ఉగ్రవాద ప్రభుత్వమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని తాలిబాన్‌తో పోల్చారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. కాగా గతే యేడాది డిసెంబరులో తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తన రాజకీయ వారసుడిగా మాయావతి ప్రకటించారు.