తన రాజకీయ వారసుడుని ప్రకటించిన మాయావతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడుని ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటించారు. తన రాజకీయ వారసుడుగా మేనల్లుడు ఆకాశా ఆనంద్ పేరును ఆమె వెల్లడించారు. ఆదివారం యూపీ రాజధాని లక్నోలో జరిగిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
గత ఏడాది కాలంగా ఆకాశ్ ఆనంద్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మాయావతి తర్వాత పార్టీ పగ్గాలు ఆయన చేపట్టనున్నారు. 2016లో బీఎస్పీలో చేరిన ఆకాశ్ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ప్రచారం చేశారు. 2022లో రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా ఆకాశ్ పేరును ప్రకటించడం పార్టీ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో మాయావతి తర్వాత అధ్యక్ష పదవి ఎవరు చేపడతారన్న చర్చకు తెరదించినట్లైంది. అలాగే, మాయావతి కూడా గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన రాజకీయ వారసుడిని ప్రకటించడం గమనార్హం.