శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (16:40 IST)

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ : కేంద్రం వెల్లడి

indian railway
దీపావళి పండుగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి యేటా ఇచ్చే ఉత్పాదక ఆధారిత బోనస్‌ను బుధవారం ప్రకటించింది. ఆ ప్రకారంగా ఈ యేడాది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పాటు సమానమైన వేతనాన్ని బోనస్‌గా చెల్లించనున్నారు.
 
ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మినహా ట్రాక్‌ మెయింటెనర్లు, లోకో పైలెట్లు, ట్రెయిన్‌ మేనేజర్లు, స్టేషన్‌ మాస్టర్లు, సూపర్‌ వైజర్లు, టెక్నీషియన్లు.. ఇలా అర్హులైన 11 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం రూ.1968.87 కోట్లు వెచ్చించనున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. 
 
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ సమావేశం అనంతరం నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్సును (డీఏ) 4 శాతం పెంచేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరగనుంది. జులై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. డీఏ పెంపు నిర్ణయంతో 48.67 లక్షల మంది ఉద్యోగులకు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.
 
ఇకపోతే, గోధుమలు అధికంగా పండించే రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్న వేళ మద్దతు ధరను కేంద్రం భారీగా పెంచింది. 2024-25 మార్కెటింగ్‌ సీజన్‌కుగానూ క్వింటాల్‌కు రూ.150 చొప్పున పెంచి రూ.2,275గా నిర్ణయించింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో గోధుమలకు మద్దతు ధర ప్రకటించడం ఇదే తొలిసారి. భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ (సీఏసీపీ) సిఫార్సులకు అనుగుణంగా రబీ సీజన్‌కు సంబంధించి ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్లు అనురాగ్ ఠాకూర్‌ తెలిపారు.