ఫ్లోర్ టెస్ట్ నిర్వహించండి.. ఎవరి బలమేంతో తేలిపోద్ది : గవర్నర్‌కు స్టాలిన్ విన్నపం
తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి ప్రభుత్వ పాలన సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుకు రాష్ట్ర విపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడె
తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి ప్రభుత్వ పాలన సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుకు రాష్ట్ర విపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే.స్టాలిన్ విన్నవించారు. ఈ మేరకు గవర్నర్‌తో స్టాలిన్ శుక్రవారం రాత్రి సమావేశమై విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన స్టాలిన్ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో 9 నెలలుగా పాలన స్తంభించిపోయిందని, సుస్థిర పాలనకు తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు స్టాలిన్ తెలిపారు.
శాసనసభను సమావేశపరచాలని తాము కోరినట్టు చెప్పారు. రాజ్యాంగానికి లోబడి మంచి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కోరామనీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెనుక డీఎంకే ఉందన్న శశికళ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఒకరిపై ఆరోపణలు చేయడం కంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని సత్వరం సమావేశపరిచి బలపరీక్షకు ఆదేశిస్తే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.