శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (12:23 IST)

టాటా పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ : ముంబై నగరాన్ని చుట్టుముట్టిన కరెంట్ కష్టాలు

ముంబై మహానగరానికి విద్యుత్ సరఫరా  చేసే టాటా ఇన్‌కమింగ్ ఎలక్ట్రిక్ సరఫరా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. దీంతో ముంబై నగరాన్ని కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సబర్బన్ రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. రహదారుల జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయక పోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఈ ఉదయం నుంచి తీవ్ర అవస్థలు పడుతున్నారు. 
 
ముంబై మహానగరానికి విద్యుత్‌ను అందించే ప్రధాన సంస్థల్లో ఒకటైన టాటా పవర్ విఫలం కావడమే సమస్యకు కారణమని పశ్చిమ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద పవర్ ఫెయిల్యూర్ ఇదేనని, ఈ ఉదయం 10.05కు సమస్య మొదలైందని పేర్కొన్నారు.
 
కాగా, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలకు ఏర్పడిన అంతరాయం పట్ల చింతిస్తున్నామని బెస్ట్ (బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్ పోర్ట్) ట్వీట్ చేసింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా సమస్య ఏర్పడిందని, ఎన్నో విభాగాలు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించింది. సాధ్యమైనంత త్వరలోనే రైళ్లు తిరిగి నడుస్తాయని, ప్రజలు సమస్యను అర్థం చేసుకోవాలని సెంట్రల్ రైల్వేస్ ట్వీట్ చేసింది.