ఐపీఎల్ 2020 : నేడు ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ : ముంబైతో ఢిల్లీ ఢీ
యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా, ఆదివారం రెండు కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలుత సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్... రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.
అయితే, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ టాస్ గెలిచింది. గత మ్యాచ్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్‌లోనూ బ్యాటింగే ఎంచుకుంది. సన్ రైజర్స్ టీమ్ ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. కాశ్మీర్ ఆటగాడు అబ్దుల్ సమద్ స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌ను తుది జట్టులోకి తీసుకుంది.
ఇకపోతే, రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, రాబిన్ ఊతప్ప తుదిజట్టులోకి వచ్చారు. బెన్ స్టోక్స్ చేరికతో రాజస్థాన్ జట్టుకు మరింత బలం చేకూరుతుందనడంలో సందేహంలేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్ధ్యం స్టోక్స్‌కు ఉంది.
ఇక హైదరాబాద్ గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది. సీజన్లో నిలకడ లేని ఆటతో ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నది. ఇందులో గెలవడం ద్వారా మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని స్టీవ్‌స్మిత్‌సేన భావిస్తోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ నాలుగింటిలో ఓడింది. ఢిల్లీతో మ్యాచ్‌లో అచ్చొచ్చిన షార్జా మైదానంలోనూ రాజస్థాన్ పరుగులు తీసేందుకు అష్టకష్టాలు పడింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తుగా ఓడించి మళ్లీ గెలుపు బాట పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆత్మవిశ్వాసంతో ఉంది.