గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (09:04 IST)

ఐపీఎల్ 2020 : జానీ బెయిర్‌స్టో వీరకుమ్ముడు - పంజాబ్ పరాజయాల పరంపర

ఐపీఎల్ 13వ సీజన్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించగా, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు తన పరాజయాల పరంపరను కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 69 పరుగులు భారీ స్కోరుతో విజయం సాధించిది. అలాగే, ఈ ఓటమితో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకుంది. 
 
ఐపీఎల్ తాజా సీజన్‌లో మొదటిసారిగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు తమ బ్యాట్లు ఝుళిపించారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. గత మ్యాచ్‌ల్లో వైఫల్యాలను పక్కనబెడుతూ... కెప్టెన్ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో ద్వయం చెలరేగి ఆడింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 160 పరుగులు జోడించడం విశేషం.
 
ముఖ్యంగా, ఓపెనర్ జానీ బెయిర్ స్టో వీరకుమ్ముడు ధాటికి పంజాబ్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 55 బంతుల్లోనే 97 పరుగులు చేసిన బెయిర్ స్టో దురదృష్టవశాత్తు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. బెయిర్ స్టో స్కోరులో 7 ఫోర్లు, 6 భారీ సిక్సులున్నాయి.
 
వార్నర్ కూడా వేగంగా ఆడి 40 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. ఈ జోడీ అవుటయ్యాక స్కోరు ఒక్కసారిగా మందగించింది. వెంటవెంటనే వికెట్లు పడడంతో సన్ రైజర్స్ అభిమానులు నిరాశకు గురయ్యారు.
 
అయితే విలియమ్సన్, అభిషేక్ శర్మ జోడీ ధాటిగా ఆడడంతో హైదరాబాద్ స్కోరు 200 మార్కు దాటింది. మొత్తమ్మీద నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అర్షదీప్ సింగ్ 2, మహ్మద్ షమి ఓ వికెట్ సాధించారు.
 
ఆ తర్వాత 202 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు... లక్ష్య ఛేదనలో తడబడింది. 16.5 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్(11) తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తుండగా, మయాంక్ అగర్వాల్ (9) లేని రన్‌కు పోయి వికెట్ సమర్పించుకున్నాడు. నికోలస్ పూరన్ మాత్రం బాగానే పోరాడాడు. క్రీజులో ఉన్నంతసేపు ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
 
పూరన్ పూనకం వచ్చినట్టు ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే హైదరాబాద్ బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. 37 బంతులు ఆడిన పూరన్ 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. అయితే, సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో అతడి మెరుపులు వృథా అయ్యాయి.
 
క్రీజులోకి వచ్చిన వారు ఎవరో తరుముతున్నట్టు వెంటవెంటనే వికెట్లు పారేసుకున్నారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు డకౌట్ కాగా, ఐదుగురు ఆటగాళ్లు పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు.
 
పూరన్ చేసిన 77 పరుగుల తర్వాత రాహుల్, సిమ్రన్ సింగ్‌లు చేసిన 11 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. టెయిలెండర్లు చేతులెత్తేయడంతో పంజాబ్ 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. ఫలితంగా పంజాబ్ జట్టు ఖాతాలో మరో ఓటమి చేరింది. అలాగే, 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సన్‌రైజర్స్ ఓపెనర్ బెయిర్‌స్టోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.