తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది
మొంథా తుఫాను తీరందాటింది. కాకినాడ - మచిలీపట్నం మధ్య ఉన్న అంతర్వేదిపాలెం వద్ద తీరం దాటింది. దీని ప్రభావం కారణంగా ఏపీలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను కోస్తాంధ్రలోని విశాఖపట్టణం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పెను ప్రభావం చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 403 మండలాలపై మొంథా తుఫాను ప్రభావం ఉంటుందని, అత్యవసరపరిస్థితిని ఎదుర్కొనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 75805 మందిని పునరావస కేంద్రాలకు తరలించారు. 219కి పైగా వైద్య క్యాంపులను వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్‌లెస్ టవర్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. 21కి పైగా భారీ సైజు ఆస్కా ల్యాంపులను కూడా సిద్ధం చేసింది. 1147 జేసీబీలు, ప్రోక్లెయిన్లు, క్రేన్లు, 321 డ్రోన్లను సర్కారు సిద్ధంగా ఉంచింది. కూలిన చెట్లు తొలగించేందుకు 1040 యాంత్రిక రంపాలను సిద్ధం చేసింది. తుఫాను ప్రభావంపై ఇప్పటివరకు 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరిక సందేశాలు జారీ చేసింది. వర్షప్రభావం రీత్యా 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని అధికారులు సిద్ధం చేశారు.
తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 38 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నెల్లూరు జిల్లా ఉలవపాడు 12.6 సెంటిమీటర్లు, సింగరాయకొండలో 10.5 సెంటీ మీటర్లు, కావలిలో 12.2, దగదర్తిలో 12, బి.కోడూరులో 6, కళింగపట్నంలో 7, విశాఖపట్నం, తునిలో 2 సెంటిమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.