గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2020 (09:53 IST)

ఐపీఎల్ 2020 : ఎదురులేని ముంబై ఇండియన్స్... ఢిల్లీ కేపిటల్స్ చిత్తు

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు జైత్రయాత్ర అప్రహతికంగా సాగుతోంది. ఆదివారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో విజయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఢిల్లీ కేపిటల్స్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవరలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 24 పరుగులకే ఓపెనర్లు పృథ్వీషా (4), రహానే (15) వికెట్లను కోల్పోయింది. దీంతో జట్టు భారాన్ని తనపై వేసుకున్న శిఖర్ ధావన్ ఆటను నిలబెట్టాడు. 
 
అయితే,  చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ జోరుగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 69 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కొంత దూకుడుగా ఆడాడు. 33 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు చేయడంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో స్టోయినిస్ 13, అలెక్స్ కేరీ 14 పరుగులు చేశారు.
 
ఆ తర్వాత 163 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టులో కెప్టెన్ రోహిత్‌శర్మ (5) విఫలమైనా క్వింటన్ డికాక్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో 53, సూర్యకుమార్ యాదవ్ 32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌‌తో 53 పరుగులతో రాణించారు. అలాగే, ఇషాన్ కిషన్ (28), కీరన్ పొలార్డ్ (11), కృనాల్ పాండ్యా (12)లు తమవంతు సహకారం అందించడంతో ముంబై జట్టు విజయభేరీ మోగించింది. 
 
కాగా, ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది వరుసగా నాలుగో గెలుపు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ముంబై 5 విజయాలతో అగ్రస్థానానికి చేరుకుంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.