శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:11 IST)

మహారాష్ట్రలో డెల్టా కలకలం.. వేరియంట్ సోకి 63 ఏళ్ల వృద్ధురాలు మృతి

మహారాష్ట్రలో ఇప్పుడు డెల్టాప్లస్‌ వేరియంట్‌.. డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. వేగంగా విస్తరిస్తూ ప్రాణాలు మింగేస్తోంది. ముంబైలో డెల్టాప్లస్‌ ఫస్ట్‌ డెత్‌ నమోదైంది. డెల్టాప్లస్‌ వేరియంట్‌ సోకి 63 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. దీంతో మహారాష్ట్రలో డెల్టాప్లస్‌ బలితీసుకున్న వారి సంఖ్య రెండుకు పెరిగింది. జూన్‌లో రత్నగిరిలో 80 ఏళ్ల వృద్ధురాలు కూడా డెల్టాప్లస్‌ వేరియంట్‌తోనే చనిపోయింది.
 
ముంబై ఈస్టర్న్‌ సబర్బ్‌కి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలికి జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు రావడంతో పరీక్షలు చేయించుకుంది. జూలై 21న ఆమెకు కరోనా ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో జూలై 24న ఆమెను ఐసీయూలో చేర్చారు వైద్యులు. మూడు రోజుల చికిత్స అనంతరం 27న ఆమె మృతి చెందింది. మరణానంతరం ఆమెకు డెల్టాప్లస్‌ వేరియంట్‌గా గుర్తించారు అధికారులు. 
 
ఆగస్ట్‌ 11న ఈ విషయాన్ని బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు వైద్యాధికారులకు తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు పరీక్షలు జరపగా.. ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఇద్దరికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఎటాక్‌ అయినట్టు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మృతి చెందిన వృద్ధురాలు రెండు డోసులు వేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.