సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (12:26 IST)

నేతాజీ రహస్యాలను వెల్లడించడం గర్వంగా ఉంది : ప్రధాని నరేంద్ర మోడీ

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 121వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం జాతి యావత్తూ ఆయనను స్మరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. పలువురు జాతీయ నేతలు నేతాజీ చిత్రపటానికి నివాళులు

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 121వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం జాతి యావత్తూ ఆయనను స్మరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. పలువురు జాతీయ నేతలు నేతాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా మోడీ స్పందిస్తూ... నేతాజీ ఓ గొప్ప మేధావి అని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం తపించేవారని, వలస పాలకులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. "ఆ మహోన్నత నాయకుడికి సంబంధించిన ఫైళ్లను వెల్లడించే అవకాశం మా ప్రభుత్వానికి దక్కడం గర్వకారణం"అని మోడీ ట్వీట్‌ చేశారు. 
 
1920లో ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసిన బోస్‌.. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించారు. అయితే ఏడాది తిరిగేలోపే ఉద్యోగాన్ని వదిలేసి జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో చేరి స్వాతంత్ర్య సంగ్రామంలోకి దూకేశారు. రెండు సార్లు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేసిన ఆయన.. మహాత్మా గాంధీతో సిద్ధాంతపరమైన విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్‌ను వీడి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించి పోరాటాన్ని కొనసాగించారు. 
 
రెండోప్రపంచ యుద్ధం సమయంలోనే బ్రిటిషర్లను దెబ్బకొట్టాలనే సంకల్పంతో నేతాజీ భారీ ప్రణాళికలు రచించారు. జపాన్‌ సహకారంతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటుచేశారు. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే 1945, ఆగస్టు 18న నేతాజీ ప్రయాణిస్తోన్న విమానం అంతర్థానమైంది. ఆ తర్వాత బోస్‌కు సంబధించి రకరకాల వార్తలు వెలువడ్డాయి. దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఆయన డెత్‌ మిస్టరీ ఇంకా విడలేదు.