గంగిరెద్దులకే అక్కడ స్థానం.. అమ్మ వారసుడు ఓపీఎస్సే.. మాఫియాలా శశివర్గం: నిర్మల
అన్నాడీఎంకే పార్టీలో అమ్మ లేని లోటు బాగా కనిపిస్తోంది. నాయకత్వం కోసం వర్గపోరు జరుగుతోంది. టీటీవీ దినకరన్, పళనిస్వామి, ఓపీఎస్ అంటూ రెండాకులు మూడుగా చీలిపోయింది. మరోవైపు జయలలిత మేనకోడలు దీప కూడా ప్రత్యే
అన్నాడీఎంకే పార్టీలో అమ్మ లేని లోటు బాగా కనిపిస్తోంది. నాయకత్వం కోసం వర్గపోరు జరుగుతోంది. టీటీవీ దినకరన్, పళనిస్వామి, ఓపీఎస్ అంటూ రెండాకులు మూడుగా చీలిపోయింది. మరోవైపు జయలలిత మేనకోడలు దీప కూడా ప్రత్యేక పార్టీ అంటూ ప్రజల్లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పళని స్వామి నుంచి ఓపీఎస్ వర్గానికి వచ్చేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది.
తాజాగా శశికళ వర్గంలో ఉన్న యాంకర్, న్యూస్ రీడర్, నటి, వ్యాఖ్యాత నిర్మలా పెరియసామి మంగళవారం రాత్రి పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకుని ఆయన వర్గంలో చేరిపోయారు. ఈ సందర్బంగా నిర్మలా పెరియసామి మీడియా మాట్లాడుతూ.. శశివర్గంపై దుమ్మెత్తి పోశారు. అమ్మ వారసులుగా.. ఆర్కే నగర్ నుంచి పోటీ చేసే అర్హత దినకరన్‌కు లేదన్నారు. ప్రస్తుతం శశికళ వర్గం అంతా ఓ మాఫియాలా తయారైందని నిర్మలా పెరియస్వామి విరుచుకుపడ్డారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు దినకరన్, శశికళ వర్గం నడుచుకోవడం లేదని చెప్పారు. ఆ వర్గంలో ఉన్నవారంతా గంగిరెద్దుల్లాగా మారిపోయారని విమర్శించారు.
టీటీవీ దినకరన్, మాజీ మంత్రి వలర్మతి తదితరుల తీరుపై మండిపడ్డారు. అమ్మ జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ. దినకరన్‌కు స్థానిక ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జయలలిత ఎంతగానో నమ్మి రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి అప్పగించిన పన్నీర్ సెల్వమే నిజమైన అమ్మ వారసుడని ఆయనకే తమ మద్దతు ఉంటుందని నిర్మలా పెరియస్వామి తెలిపారు. ఓపీఎస్ మద్దతు మరింత పెరిగే అవకాశం ఉందని.. త్వరలో శశివర్గం నుంచి అందరూ ఓపీఎస్ వర్గానికి చేరిపోతారని నిర్మల ధీమా వ్యక్తం చేశారు.