ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 35శాతం రిజర్వేషన్లు
విధానసభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఒక అటవీ శాఖకు మినహాయింపు ఉంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1997ని సవరించారు.
"సర్వీస్ రూల్స్ ఉన్నప్పటికీ, మేము రాష్ట్ర సేవలో మహిళలకు (అటవీ శాఖ మినహా) అన్ని పోస్టులలో 35 శాతం రిజర్వ్ చేస్తున్నాము" అని నోటిఫికేషన్ పేర్కొంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవలే 35 శాతం పోలీసు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు మహిళలకు రిజర్వ్ చేయబడతాయని ప్రకటించారు. అయితే తాజా నోటిఫికేషన్‌లో, ఇది అన్ని ఉద్యోగాలకు వర్తింపజేయబడింది.
అలాగే లాడ్లీ బెహనా యోజన పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు ఇచ్చే రూ.1,250 శుక్రవారం ఖాతాలో వేస్తామని, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి చెప్పారు.
తెలంగాణ తరహాలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.