ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2017 (16:30 IST)

పళనిస్వామి సర్కారుపై ఆర్టికల్ 32 అస్త్రం... సుప్రీంలో అమీతుమీకి సిద్ధమైన పన్నీర్ సెల్వం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి సర్కారుపై మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 అస్త్రాన్ని ప్రయోగించనున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి సర్కారుపై మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు సైతం తిరస్కరించే అవకాశం లేదు. అందుకే ఈ ఆర్టికల్ కింద పిటీషన్ దాఖలు చేయాలంటూ హస్తినలోని తన న్యాయవాదులకు ఆయన సూచన చేసినట్టు సమాచారం. 
 
ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడులో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో పన్నీర్ సెల్వం తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన మళ్లీ సీఎం కుర్చీలో కూర్చొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, అవేమీ ఫలించలేదు. దీంతో తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు నెగ్గిన విశ్వాస పరీక్షను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
 
పళని స్వామి సర్కారు విశ్వాస పరీక్షపై ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోంది. ఇందులోభాగంగా, బలపరీక్ష జరిగిన రోజు వీడియో ఫూటేజీలను ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌కు అప్పగించాలంటూ మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాను కూడా సుప్రీంకోర్టు కేంద్రంగా న్యాయపోరాటం చేయాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. 
 
రాజ్యాంగంలోని అర్టికల్ 32 కింద పిటిషన్ సిద్ధం చేయాల్సిందిగా పన్నీర్ ఢిల్లీలోని తన లాయర్లకు సూచించినట్టు ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక ఉటంకించింది.  పైగా, దీనిపై సత్వరమే విచారణ చేపట్టాలంటూ లాయర్లు ధర్మాసనాన్ని కోరేలా పన్నీర్ సలహా ఇచ్చారని ఆ పత్రికా కథనంలో పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు సైతం తిరస్కరించే అవకాశం లేదు. అందుకే పళనిపై ఈ అస్త్రాన్ని ప్రయోగించేందుకు పన్నీర్ సిద్ధమైనట్టు సమాచారం.