1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల పోరుబాటు... 28న ఆక్రోశ్‌ దివస్‌

దేశంలో పెద్ద నోట్ల రద్దుపై పోరు చేసేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఈ నెల 28వ తేదీన భారత బంద్‌కు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం 13 విపక్ష పార్టీలు ఆందోళనకు దిగిన వ

దేశంలో పెద్ద నోట్ల రద్దుపై పోరు చేసేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఈ నెల 28వ తేదీన భారత బంద్‌కు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం 13 విపక్ష పార్టీలు ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. తృణమూల్‌, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ, డీఎంకే, వామపక్షాలు, తదితర పార్టీలకు చెందిన 200 మందికిపైగా ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. 
 
ప్రధాని పార్లమెంట్‌కు వచ్చి రద్దుపై దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దును ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికారహిత ఆర్థిక ప్రయోగంగా అభివర్ణించారు. ఆర్థికరంగ నిపుణులను సంప్రదించకుండా ఆర్థిక మంత్రికి తెలియకుండా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు. 
 
పార్లమెంట్ అంటే ప్రధాని ఎందుకు భయపడుతుంటూ నిలదీశారు. రద్దు నిర్ణయంతో సాఫీగా సాగుతున్న దేశ ఆర్థికవ్యవస్థ భారీ కుదుపునకు గురైందని విమర్శించారు. రైతులు, మత్స్యకారులు, సాధారణ కూలీలు అందరిపైనా రద్దు నిర్ణయం దారుణంగా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద బడాబాబులు కానీ, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా క్యూలో నిల్చున్న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
 
కాగా, రద్దుపై విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వని పక్షంలో రాష్ట్రపతిని కలవాలని భావిస్తున్నట్లు సీపీఐ నేత డి.రాజా తెలిపారు. ఈ నెల 28న దేశవ్యాప్తంగా ఆక్రోశ్‌ దివస్‌ పేరిట ఆందోళనలు చేస్తామని సీపీఎం ప్రకటించింది. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. 
 
జేడీయూ, ఎస్పీ, ఎన్సీపీ, ఆప్‌ నేతలు మమతకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేతిలో దేశానికి భద్రత లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని, వారి హక్కులను బలవంతంగా లాగేసుకున్నారని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలపై రద్దు ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.