పారాసిట్మాల్ మాత్రల్లో నాణ్యతా లోపం : డ్రగ్స్ టెస్టుల్లో ఫెయిల్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినియోగంలో ఉన్న భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) నాణ్యతా పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల్లో పారాసిట్మాల్ మాత్రలు, కాల్షియం, విటమిన్ డి3లతో సహా ఏకంగా 53 రకాల మందులు క్వాలిటీ టెస్టుల్లో విఫలమయ్యాయి. రాష్ట్ర ఔషధ అధికారులు నెలవారీగా యాదృచ్ఛికంగా సేకరించే నమూనాల నుంచి ఈ నాణ్యతా పరీక్షలు చేసినట్టు వివరించింది.
ఈ నాణ్యతా పరీక్షల్లో విఫలమైన మరికొన్ని ఔషధాల జాబితాలో విటమిన్ సీ, డీ3 మాత్రలు, షెల్కాల్, విటమిన్ బీ కాంప్లెక్స్, విటమిన్ సీ సాఫ్టే జెల్స్, యాంటీ యాసిడ్ పాన్-డీ, పారాసిటమాల్ ఐపీ 500 ఎంజీ, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమెపిరైడ్, హైబీపీ ఔషధం టెర్మిసార్టన్ ఉన్నాయి. ఈ ఔషధాలను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్), కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్ సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్‌తో పాటు మరి కొన్ని కంపెనీలు తయారుచేస్తున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ (హెచ్ఐఎల్) ఉత్పత్తి చేసే మెట్రోనిడాజోల్ కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమైన ఔషధాల జాబితాలో ఉంది. పొట్ట ఇన్ఫెక్షన్ల చికిత్సలో విస్తృతంగా దీనిని ఉపయోగిస్తుంటారు. ఆల్కెమ్ హెల్త్ సైన్స్ తయారు చేసే యాంటీబయాటిక్స్ 'క్లావమ్ 625, పాన్ డీ కూడా క్వాలిటీగా లేవని తేలింది.