గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (01:46 IST)

భారతీయుల నైపుణ్యాలతో అమెరికాకుకు ఎంతో మేలు: ప్రధాని

భారతీయుల నైపుణ్యాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

భారతీయుల నైపుణ్యాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నైపుణ్యం గల వృత్తి నిపుణుల పట్ల ఆచి, తూచి, దూరదృష్టితో వ్యవహరించాలని అమెరికాను  కోరారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, సమాజం సుసంపన్నం కావడంలో భారతదేశ ప్రతిభావంతులు నిర్వహిస్తున్న పాత్రను గుర్తు చేశారు. హెచ్‌1బీ వీసాలను కుదించేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనా యంత్రాంగం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మోదీ ఆ దేశ ప్రతినిధి బృందంతో మంగళవారం చర్చలు జరిపారు. ఇరు దేశాలూ కలసి పనిచేయగలిగిన రంగాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు విధిస్తే భారతదేశంపై చెప్పుకోదగ్గ ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. 26 మంది సభ్యులతో కూడిన అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీ వచ్చింది.
 
ఈ బృందంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. అమెరికా కాంగ్రెస్, పరిపాలన మారిన నేపథ్యంలో ఈ బృందం భారతదేశంలో పర్యటించడం ద్వైపాక్షిక సహకారానికి శుభారంభ సూచకమని పేర్కొన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తన సంభాషణ సానుకూలంగా జరిగిందని గుర్తు చేసుకున్నారు.  గత రెండున్నరేళ్ళలో బలపడిన సంబంధాలను మరింత పటిష్టపరిచేందుకు ఇరు దేశాలు అంకితభావం ప్రదర్శిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారని ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
 
ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఐటీశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య,వైద్య సదుపాయాలు మెరుగుపర్చడానికి తమ కంపెనీ ప్రారంబించిన ‘డిజిటల్‌ ఇన్‌క్లూజన్‌’ కార్యక్రమం గురించి చర్చించారు. భారత్‌లో సుపరిపాలనకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వినియోగంపై నీతి ఆయోగ్‌ కార్యాలయంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోనూ సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. వృత్తిపరమైన నెట్‌వర్కింగ్‌ వైట్‌సైట్‌ లింక్డ్‌ఇన్‌ ద్వారా ఉపాధి కల్పించడంపై సత్య, ప్రసాద్‌లు చర్చించారు. భారత పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల ముంబైలో జరిగే ‘ఫ్యూచర్‌ డీకోడెడ్‌’ కార్యక్రమంలోనూ పాల్గొంటారు.