శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (11:59 IST)

విజయ్ దివస్ : ఇండోపాక్ యుద్ధానికి 50 యేళ్లు.. స్వర్ణ జ్యోతి ప్రజ్వలన

పాకిస్థాన్ అంతర్భాగంగా ఉన్న బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించి నేటికి 50 యేళ్లు. ఈ రోజుకు గుర్తుకు ప్రతి యేటా విజయ్ దివస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ జ్యోతిప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. 
 
1971 ఇండో-పాక్‌‌ల మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయజ్యోతిని వెలిగించారు. కాగా ఈ స్వర్ణ విజయజ్యోతిని 1971 యుద్ధం తర్వాత పరమ్‌వీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర పురస్కార గ్రహీత గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రదేశాలకు తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్‌ రావత్‌ పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.
 
కాగా, ఈ యేడాదితో భారత్‌ విజయానికి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా స్వర్ణ విజయ సంవత్సరంగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనున్నట్లు రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌(ఇప్పటి బంగ్లాదేశ్‌)లో స్వతంత్రం పేరుతో మొదలైన ఇది భారత్‌- పాక్‌ యుద్దానికి తెరలేపింది. 
 
డిసెంబర్‌ 3 1971న మొదలైన యుద్ధం డిసెంబర్‌ 16న ముగిసింది. ఈ యుద్ధంలో భారత్‌ పాకిస్తాన్‌పై విజయం సాధించడంతో బంగ్లాదేశ్‌ ఏర్పడింది. యుద్ధంలో పాక్‌పై సాధించిన విజయానికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రతి ఏటా డిసెంబర్‌ 16ను విజయ్‌ దివస్‌ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.