కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన ప్రధాని మోడీ.. ఇలాంటి సమానత్వం బీజేపీలో మాత్రమే సాధ్యం!
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సాధారణ కార్యకర్తగా మారిపోయారు. వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఆరుబయట కూర్చొని భోజనం చేశారు. ఈ అరుదైన దృశ్యం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో జరిగింది. ఆ తర్వాత కార
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సాధారణ కార్యకర్తగా మారిపోయారు. వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఆరుబయట కూర్చొని భోజనం చేశారు. ఈ అరుదైన దృశ్యం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో జరిగింది. ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను బీజేపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇలాంటి సమానత్వం ఒక్క బీజేపీలోనే సాధ్యమంటూ ట్వీట్ చేసింది. ఇంతకు ప్రధాని మోడీ కార్యకర్తలతో కలిసి భోజనం ఎందుకు చేశారన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.
వచ్చే యేడాది ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వారణాసిలో గురువారం వేలాదిమంది కార్యకర్తలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. కార్యకర్తలంతా ఎవరి భోజనం వారే తెచ్చుకోవాలంటూ సభా నిర్వాహకులు ముందే పిలుపునిచ్చారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన వెంట బాక్సు తెచ్చుకున్నారు.
'నేను కూడా పార్టీ కార్యకర్తనే... అందుకే నా భోజనం నేనే తెచ్చుకున్నా' అని పార్టీ నేతలతో అన్నారు. ప్రధాని కోసం కొందరు లంచ్ బాక్సు తీసుకొచ్చినా... ఆయన మాత్రం తాను తెచ్చుకున్న భోజనమే అందరితో పాటు కలిసి ఆరగించారు.
అంతేనా... తన వెంట తెచ్చుకున్న లంచ్‌బాక్స్‌ను పార్టీ సహచరులతో కలిసి కూర్చుని ఆరగించారు. ఈ దృశ్యాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసిన బీజేపీ... 'ఇలాంటి సమానత్వం బీజేపీలో మాత్రమే సాధ్యం' అని వ్యాఖ్యానించింది.
కాగా, 'ఈ సామావేశానికి వారణాసిలోని మొత్తం 1700 పోలింగ్ బూత్‌ల నుంచి 26 వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు. వారందరితో కలిసి ప్రధాని లంచ్ చేశారు' అని బీజేపీ ట్విట్టర్లో పేర్కొంది.