బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నేటితో రాంనాథ్ కోవింద్ పదవీకాలం పూర్తి - సెంట్రల్‌ హాలులో వీడ్కోలు ప్రసంగం

ramnath kovind
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. దీంతో ఆయన సెంట్రల్ హలులో తన తుది వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ పార్టీలకు కీలక సూచనలు చేశారు పార్టీలు పక్షపాత రాజకీయాలను పక్కనపెట్టాలని హితవు పలికారు. ప్రజల సంక్షేమం కోసం అత్యవసరమయ్యే విషయాలపై సమాలోచనలు జరపాలని సూచించారు. 
 
పార్లమెంటును 'ప్రజాస్వామ్య దేవాలం'గా అభివర్ణించిన ఆయన ఎంపీలు తాము ఎన్నుకొన్న ప్రజల అభీష్టాన్ని ఇక్కడ వ్యక్తం చేయాల్సి ఉంటుందన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ పెద్ద కుటుంబంలాంటిదని చెబుతూ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజమేనని గుర్తుచేశారు. వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని పార్టీలకు హితవు చెప్పారు. 
 
తమ వ్యతిరేకతను తెలపడానికి రాజకీయ పార్టీలు మహాత్మాగాంధీ అనుసరించిన శాంతి, అహింస మార్గాలు అనుసరించి లక్ష్యాలను సాధించుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయన వ్యాఖ్యలకు సభలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య తదితరులు హర్షధ్వానాలు తెలిపారు. వివిధ ప్రభుత్వాలు చేసిన కృషి కారణంగా ఎంతో అభివృద్ధి జరిగిందని కోవింద్‌ గుర్తుచేశారు. 
 
తాను వర్షానికి నీరు కారే మట్టి ఇంటి నుంచి వచ్చానని తెలిపారు. ఇప్పుడు పేదలు పక్కా ఇళ్లలో ఉంటున్నారని, ఇందుకు కొంతవరకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయన్నారు. అన్ని రంగాల్లో జరుగుతున్న అభివృద్ధితో అంబేద్కర్ కలలు సాకారం అవుతున్నాయన్నారు. అలాగే, కొత్తగా రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఆయన అభినందనలు తెలిపారు. ఆమె మార్గదర్శకత్వలంలో దేశం లబ్ధి పొందుతుందని ఆకాక్షించారు.