శ్రీలంకలో మళ్లీ ఆందోళన - రణిల్ విక్రమ సింఘే రాజీనామాకు డిమాండ్
శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో 50 మందికి పైగా ఆందోళనకారులు గాయపడ్డారు. అంతేకాకుండా అధ్యక్ష భవనానికి సమీపంలో ఉన్న నిరసన శిబిరాలను తొలగించారు.
శ్రీలంక పార్లమెంట్ 40 యేళ్ల చరిత్రలో తొలిసారి ప్రత్యక్షంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అలా కొత్త అధ్యక్షుడుగా దేశానికి ఆరుసార్లు ప్రధానిగా పని చేసిన రణిల్ విక్రమ సింఘే ఎన్నుకోగా, ఆయన గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే నిరసనకారులు ఆందోళనకు దిగారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోని ప్రధాన క్యాంపుపై శుక్రవారం తెల్లవారుజామున వందల మంది భద్రతా బలగాలు, పోలీసులు విరుచుకుపడ్డారు అధ్యక్ష భవనాన్ని ముట్టిడించిన నిరసనకారులకు చెందిన పలు టెంట్లను తొలగించారు.