పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంగా ఆధార్ చెల్లుబాటు కాదు : ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం
ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు పుట్టిన తేదీ ధృవపత్రంగా ఆధార్ కార్డు చెల్లుబాటు కాదని పేర్కొంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇకపై ఆధార్ ప్రాథమిక గుర్తింపు ధృవీకరణ పత్రంగా మాత్రమే పరిగణించాలని, జనన ధృవీకరణకు ప్రామాణికం కాదని ఈపీఎఫ్‌వో జనవరి 16వ తేదీన జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.
ఈ నిర్ణయానికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ కూడా గురువారం ఆమోదం తెలిపింది. ఇటీవల పలు కేసుల్లో న్యాయస్థానాలు ఆధార్ జనన ధృవీకరణ పత్రంగా గుర్తించలేమని తీర్పును వెలువరించాయి. దీంతో ఆధార్ ప్రామాణికంగా పుట్టిన తేదీలో మార్పులు చేయలేమని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఇకపై ఖాతాదారులు జనన ధృవీకరణ పత్రంగా కింద పత్రాలను సమర్పించాల్సి వుంటుంది.
* ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా బోర్డు లేదా విశ్వవిద్యాలం జారీ చేసే మార్కుల జాబితా.
* స్కూల్ ట్రాన్సఫర్ సర్టిఫికేట్ (ఎస్టీసీ) లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (ఎస్ఎల్సీ).
* సర్వీస్ రికార్డు ఆధారంగా జారీ చేసిన సర్టిఫికేట్.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసి పెన్షన్ సర్టిఫికేట్.
* ప్రభుత్వం జారీచేసిన నివాస ధృవీకరణ పత్రం.
* పాన్ కార్డు, పాస్‌పోర్టు, సివిల్ సర్జన్ జారీ చేసి వైద్య నివేదిక .