భూమిపూజకు ఆహ్వాన పత్రికలను పంపుతున్న తీర్థక్షేత్ర ట్రస్ట్

ayodhya
ఠాగూర్| Last Updated: మంగళవారం, 4 ఆగస్టు 2020 (18:23 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య‌లో రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన భూమి పూజ జరుగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అయోధ్యలో ఉత్సాహ‌పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ భూమిపూజ‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. పలువురు కీలక నేతలు వస్తున్నారు.

ఈ భూమిపూజ‌ కోసం అతిథులకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రికలను పంపుతోంది. ఈ ఆహ్వాన లేఖ ఇప్ప‌డు ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం ఈ కార్య‌క్ర‌మానికి 200 మంది అతిథులను ఆహ్వానిస్తున్నారు.

దీనిలో ప్రధాని మోడీ రాక గురించిన‌ సమాచారాన్ని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. పైగా, అతిథులు ఆగస్టు 4వ తేదీన సాయంత్రానికే అయోధ్యకు చేరుకోవాలని విజ్ఞప్తిచేశారు. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, బీజేపీ నేత ఉమా భారతి, రామాలయ ఉద్యమంతో సంబంధం క‌లిగిన‌ సాధ్వీ రితాంభర, ఇక్బాల్ అన్సారీ త‌దిత‌రుల‌ను ఆహ్వానించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఆగస్టు 5వతేదీన ప్ర‌ధాని మోడీ ఉదయం 11.15 గంటలకు సాకేత్ కాలేజీకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హనుమాన్ గ‌డి ఆలయానికి వెళతారు. తర్వాత రామాల‌య‌ భూమి పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఇది ముగిసిన అనంత‌రం ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయోధ్యలో దాదాపు 2 గంటలు గడిపిన తర్వాత ప్రధాని మోదీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ భూమిపూజ కార్యక్రమాన్ని అనేక ఆంక్షల మధ్య నిర్వహిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :