బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (12:34 IST)

హెల్ప్‌లైన్‌తో ఆటాడుకున్న తుంటరి.. సరైన పని చేసిన అధికారులు...

ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టేసింది. అలాగే, మనదేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా ఈ వైరస్ కబళించింది. దీంతో అత్యవసర సహాయార్థం ఓ హెల్ప్ నంబర్లను ఆయా రాష్ట్రాలతో పాటు.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఓ తుంటరి ఈ హెల్ప్ లైన్‌తో ఆటాడుకున్నారు. ఈ నంబరుకు ఫోన్ చేసి... వేడివేడి సమోసాలు కావాలంటూ కోరాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అధికారులు.. ఆ తర్వాత కూల్ అయ్యారు. కొద్దిసేపటికి తుంటరి కోరినట్టుగానే వేడివేడి సమోసాలను తీసుకెళ్లి ఇచ్చారు. వాటిని ఆరగించిన తర్వాత చొక్కాపట్టుకుని వీధిలోకి లాక్కొచ్చి.. మురికి కాలువలను శుభ్రం చేయించారు. దీంతో ఆ తుంటరి తిక్క కుదిరింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంపూర్‌లో ఏర్పాటు చేసిన కరోనా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి, తనకు నాలుగు సమోసాలు కావాలని కోరాడు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా, పదే పదే ఫోన్ చేసి సమోసాలు అడుగుతూనే ఉన్నాడు. దీంతో విషయం తెలుసుకున్న రాంపూర్ జిల్లా కలెక్టర్ ఆంజనేయ కుమార్ సింగ్, అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
 
సమోసాలు ఆర్డర్ చేస్తున్న ఆకతాయి ఇంటికి వాటిని తీసుకెళ్లి అందించారు. అనంతరం అసలు విషయం చెప్పారు. అధికారుల విధులను ఆటంకపరిచాడన్న ఆరోపణలపై మరుగుదొడ్లను శుభ్రం చేయాలంటూ, సామాజిక శిక్షను విధించారు. ఈ విషయాన్ని ఆంజనేయ కుమార్ సింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు.. సరైన పనిచేశారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.