శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (17:37 IST)

లాక్‌డౌన్ కష్టాలు: అనంతపురంలో కొడుకు శవాన్ని చేతుల్లో మోసుకెళ్లిన తండ్రి

బుధవారం ఉదయం... దేశం మొత్తం లాక్‌డౌన్ కొనసాగుతూ ఉంది. గోరంట్ల పట్టణంలో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. పదకొండేళ్ల కొడుకు శవాన్ని చేతులపై మోస్తూ, స్మశానం వైపు నడుస్తున్నారు ఓ వ్యక్తి. చిన్నకొడుకు, భార్య ఆయన్ను అనుసరిస్తున్నారు. భార్య చంకలో 7 నెలల పసికందు కూడా ఉంది.

 
పట్టణంలో లాక్‌డౌన్ ఫొటోలు తీయడానికి బయటికొచ్చిన స్థానిక రిపోర్టర్ శివ ఈ దృశ్యాన్ని చూశారు. శివ తీసిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో తిరుగుతూ, బీబీసీ దృష్టికి వచ్చాయి. ఈ విషయమై బాధిత కుటుంబంతో బీబీసీ మాట్లాడింది.

 
అనంతపురం జిల్లా గోరంట్ల పట్టణంలో బుధవారం ఉదయం, కన్నకొడుకు శవాన్ని చేతులపై మోస్తూ కనిపించారు ఓ తండ్రి. పేరు మనోహర. దేశం మొత్తం లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో, చనిపోయిన కొడుకును స్మశానానికి తీసుకుపోవడం మరో సమస్యగా మారింది మనోహరకు.

 
ఊరిలో ఆటోలు, బండ్లు ఏవీ తిరగడం లేదు. కరోనా భయంతో ఎవరూ బయటకు రావడంలేదు. ఇక చేసేది లేక, తన కొడుకు శవాన్ని మోస్తూ స్మశానం వైపు కదిలారు మనోహర. గోరంట్ల పట్టణంలోని మాధవరాయస్వామి దేవాలయం వెనక, కొన్ని కుటుంబాలు ప్లాస్టిక్ టార్బల్స్, ఫ్లెక్సీలతో చిన్నచిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. ఆ సమూహానికి చెందినదే మనోహర్ కుటుంబం.

 
చెత్తకుప్పల్లో పేపర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుని, గుజరీకి అమ్మడం ఆయన వృత్తి. ఆయన భార్య, సమీప ఇళ్లల్లో ఆహారం కోసం మాత్రమే భిక్షాటన చేస్తుందని మనోహర చెప్పారు. వీరికి ఇద్దరు కొడుకులు, 7 నెలల కూతురు ఉన్నారు. చనిపోయింది పెద్దకొడుకు దేవ.

 
తమ కుటుంబానికి రేషన్, ఆధార్, ఓటర్ కార్డులేవీ లేవని మనోహర్ చెప్పారు. గోరంట్ల పట్టణంలో 14 సంవత్సరాలుగా ఉంటున్నామని, పలుమార్లు రేషన్, ఓటర్ కార్డుల కోసం దరఖాస్తు చేసినా ఫలితం లేదన్నారు.

 
''ఇప్పటికి నాలుగైదుసార్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినాం సార్. కానీ, ఎప్పుడు అడిగినా, మీ పేర్లు లిస్టులో లేవు, పేర్లు ఎగిరిపోయినాయి అంటున్నారు. ఇప్పటికి 14 ఏండ్ల నుంచి 40 కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాం. కానీ మాకు ఓటరు, రేషన్ కార్డులు లేవు'' అని మనోహర అన్నారు.

 
కరోనా లాక్‌డౌన్ మనోహర కుటుంబాన్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టింది. మార్చి 20న తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో దేవను గోరంట్ల ఆస్పత్రిలో చేర్చినట్లు మనోహర చెప్పారు. వెంటనే పెద్దాసుపత్రికి తరలించాలన్న డాక్టర్ సలహాతో మార్చి 22న జనతా కర్ఫ్యూ నేపథ్యంలో, కొడుకును తీసుకుని ఎలాగో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు మనోహర.

 
''చుట్టుపక్కల వాళ్లంతా కలిసి, నా చేతిలో 1700 రూపాయలు పెట్టినారు. ఆ డబ్బులతోనే దేవను హిందూపురం తీసుకుపోయినా'' అని బీబీసీతో మనోహర చెప్పారు. అక్కడి వైద్యానికి కూడా దేవ స్పందించకపోవడంతో, అనంతపురం లేదా బెంగళూరుకు తీసుకుపొమ్మని వైద్యులు సూచించారు. కానీ, అప్పటికే లాక్‌డౌన్ ప్రారంభమైంది. రోడ్లపై ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలేవీ నడవడం లేదు.

 
''కొడుకును బతికించుకునేకి నానా తంటాలు పడినా. బెంగళూరుకు తీసుకుపొయ్యేకి నా చాతకాదు. అనంతపురం పోదామంటే బస్సులు, జీపులు ఏమీ లేవు. హిందూపురం గవర్నమెంటు ఆస్పత్రి నుంచి అనంతపురం ఆస్పత్రికి పొయ్యేకి 108కి ఫోన్ చేస్తే, ఆస్పత్రి పెద్దసారు ఫోన్ చేస్తేనే ఆంబులెన్స్ పంపిస్తామని చెప్పినారు. పెద్దసార్‌ని అడిగితే, అంతదూరం ఆంబులెన్స్ రాదు అన్నారు. బయట బస్సులు లేవు. అప్పుడు నా పరిస్థితి ఏంది? యా దేవున్ని మొక్కితే నా కొడుకు బతుకుతాడు చెప్పు?'' అని అన్నారు మనోహర.

 
ఈ విషయమై హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కేశవ్‌ను బీబీసీ సంప్రదించగా ఆయన.. ''నిజమేనండీ, ఆంబులెన్సుల పరిస్థితి దారుణంగా ఉంది. హిందూపురం నియోజకవర్గం మొత్తానికి రెండు ఆంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. నెలలు నిండిన గర్భిణులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. తక్కిన కేసుల్లో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆంబులెన్సులను పంపుతున్నాం. పైగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం కాదు. ఎవరికైనా ఆంబులెన్సు కావాలంటే, సంబంధిత డాక్టర్ సంతకం, సూపరింటెండెంట్ అనుమతి కావాలని అంబులెన్స్ వాళ్లు అడుగుతున్నారు. ఇదంతా పని ఒత్తిడి వల్లనే'' అని డా.కేశవ్ వివరించారు.

 
దాదాపు 60-70 కి.మీ. పరిధిలో హిందూపురం ప్రభుత్వాసుపత్రి పెద్దది. ఇది రెఫరల్ హాస్పిటల్ కూడా. లాక్‌డౌన్ నేపథ్యంలో బస్సులు, ఇతర వాహనాలు రోడ్లపై తిరగడం లేదు. ప్రభుత్వ అంబులెన్సులు కూడా చేతులెత్తేశాయి.

 
''బస్సులుండింటే నా బిడ్డను ఎట్లనో భుజానికేసుకుని అనంతపురం పోతాంటి. కానీ బస్సులు, జీపులు బంద్. 108కు ఫోన్ చేసినా అంబులెన్సులు రాలేదు. ప్రైవేటు ఆంబులెన్సుల వాళ్లు, నాలుగైదు వేల రూపాయలు అడిగిరి. కానీ, అప్పుడు నాదగ్గర 1,500 కాసులు మాత్రమే ఉండాయి. చేతికి అందొచ్చిన కొడుకు అన్నా! బతికించుకుంటాను రండన్నా!! అని బతిమిలాడినా, ఒక్కరూ రాకపాయిరి. ఇంగేంజేయల్ల సార్? హిందూపురంలోనే నిలబడిపోతిమి. బుధవారం రాత్రి నా కొడుకు సచ్చిపాయ.'' అని మనోహర చెప్పారు.

 
''ఆ అబ్బాయికి న్యుమోనియా, సివియర్ అక్యూట్ ట్రాన్సిలైటిస్. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. బతికే అవకాశాలు చాలా తక్కువ. అనంతపురం లేదా బెంగళూరుకు వెళ్లడం ఒక ఆప్షన్ మాత్రమే, సొల్యూషన్ కాదు. వీరంతా పోషకాహార లోపం ఉన్న పిల్లలు. వాళ్లు చికిత్సకు స్పందించరు. చూడటానికి మామూలుగానే కనిపించినా వీళ్లకు శక్తి ఉండదు'' అని డా.కేశవ్ బీబీసీతో అన్నారు.

 
మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకువెళ్లడానికి చాలని ఆ డబ్బులు, తన కొడుకు శవాన్ని సొంతూరుకు తీసుకువెళ్లడానికి మాత్రం సరిపోయాయి. మిగిలిన 1,500 రూపాయలతో దేవ శవాన్ని, ఓ ప్రైవేటు అంబులెన్సులో హిందూపురం నుంచి గోరంట్లకు తీసుకొచ్చారు మనోహర.

 
ఇంటికైతే చేరుకున్నారు కానీ 'డబ్బులు, లాక్‌డౌన్' రెండూ ఇంకా వారికి సమస్యగానే మిగిలున్నాయి. కొడుకు శవాన్ని స్మశానం చేర్చడం ఒక సమస్య అయితే, అంత్యక్రియలు జరిపించడం మరో సమస్యగా మారింది.

 
అయితే, ఇరుగుపొరుగు వాళ్ల సాయంతో అంత్యక్రియల కోసం డబ్బు పోగైందని మనోహర బీబీసీతో చెప్పారు. కానీ కొడుకు శవాన్ని స్మశానానికి తీసుకుపోవడం మరో సమస్య. దేశమంతా లాక్‌డౌన్, కళ్లముందు కొడుకు శవం! ఒకవైపు రోడ్లన్నీ ఖాళీ, మరోవైపు గంటగంటకూ పెరుగుతున్న ఎండ!!

 
''ఇంగా లేటు చేస్తే ఎండ కూడా మోపు అయితాది. ఆటోలు రామన్నారు. అందుకే నా బిడ్డను భుజం మీదికి ఏసుకుని స్మశానం దావ పట్టినాం'' అన్నారు మనోహర. 

 
లాక్‌డౌన్ నేపథ్యంలో మనోహరకు, బతకడమే ఓ సమస్యగా మారింది. చెత్తకుప్పలను గాలించి, పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు ఏరితేకానీ వీరి ఆకలి తీరదు. అలాగని బయటకు అడుగుపెట్టాలంటే పోలీసుల ఆంక్షలు, కరోనా భయం.

 
''దాదాపు రెండు వారాల నుంచి పని లేదు. ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతున్నాను. రెండు రోజుల నుంచి ఎవరో అన్నదానం చేస్తున్నారు. ఆ ఒక్క పూట తిని బతుకుతున్నాం. అదీ లేకపోతే కరోనా తగలకుండా ముఖానికి కొంగు కప్పుకుని ఇండ్లకాటికిపోయి బిచ్చమెత్తుకుని వస్తాది మా ఆడమనిసి'' అన్నారు మనోహర.

 
మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మార్వో బాలకిషన్, మనోహర కుటుంబాన్ని పరామర్శించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కుటుంబ అవసరాలకు గాను రూ.2,500 నగదు, 50 కిలోల బియ్యం, గోధుమ పిండి, పప్పుదినుసులను అందించారు.

 
''లాక్‌డౌన్ కారణంగా ఈ విషయం మా వరకు రాలేదు. మనోహర కూడా పోలీసులను, ఇతర అధికారులను ఎవరినీ సంప్రదించలేదు. వీళ్లకు స్థిర నివాసం అంటూ ఏదీ లేదు. కదిరి, ధర్మవరం, గోరంట్ల ప్రాంతాల మధ్య తిరుగుతుంటారు. ఒకవేళ వీరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటామంటే, ప్రస్తుత కోవిడ్-19 ఎమర్జెన్సీ తర్వాత వీళ్లకు అవసరమైన ఆధార్, రేషన్, కార్డులు అందేలా ఏర్పాటు చేస్తాం. గతంలో వీరు రేషన్ కోసం దరఖాస్తు చేయడం మా దృష్టికి రాలేదు. వీరిలాగా మరికొన్ని కుటుంబాలను కూడా మేం గుర్తించాం. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ఏర్పాటు చేస్తాం'' అని గోరంట్ల తహసీల్దార్ బాలకిషన్ బీబీసీతో చెప్పారు.