దూసుకొస్తున్న "ఫణి"... సముద్రంలో అలజడి
హిందూ మహాసముద్రం దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వెంటనే తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది శుక్రవారం నాటికి హిందూ మహాసముద్రం - మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండంగా మారి తర్వాత 24 గంటల్లో తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు ఫణి అని పేరు పెట్టారు.
ఇది శ్రీలంక తూర్పుతీరం దిశగా పయనించి ఏప్రిల్ 30వ తేదీన ఉత్తర తమిళనాడు తీరం దిశగా రానుందని పేర్కొంది. అయితే తుఫాను తమిళనాడుకు దగ్గరగా వచ్చిన తర్వాత దిశ మార్చుకుంటుందని ఆర్జీజీఎస్, ఇస్రో నిపుణులు అంచనా వేశారు. దీనిపై శుక్ర, శనివారాల్లో మరింత స్పష్టత వస్తుందని భారత వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇకపోతే, ఈనెల 30వ తేదీన ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.
దీంతో తమిళనాడు కోస్తా ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈనెల 30, మే 1 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలంటూ భారత వాతావరణ శాఖ తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు హెచ్చరించింది. ఐఎండీ అంచనా మేరకు ఈనెల 28నుంచి తమిళనాట వర్షాలు ప్రారంభమవుతాయి. 29న పలుచోట్ల భారీవర్షాలు కురుస్తాయి. తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో ఈనెల 30, మే 1వ తేదీన తమిళనాడులో విస్తారంగా, పలుచోట్ల భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడా అసాధారణ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.