శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (09:41 IST)

తమిళనాడు : ఇద్దరు రాజకీయ ఉద్ధండులు లేని ఎన్నికలు

తమిళనాడు రాజకీయాలను సుధీర్ఘకాలం పాటు తమ కనుసన్నల్లో శాసించిన ఇద్దరు ఉద్ధండులు కరుణానిధి, జయలలిత. వారిద్దరూ లేకుండా తొలిసారి తమిళనాడు రాష్ట్ర ఎన్నికలను ఎదుర్కొంటోంది. దీంతో ఈ ఎన్నికలను అన్నాడీఎంకే, డీఎంకేలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం రెండో దశ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ విడతలోనే తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లో 38 స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బు పట్టుబడటంతో వేలూరు లోక్‌సభకు నిర్వహించాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. 
 
ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు చెరో 20 స్థానాల్లో బరిలో ఉన్నాయి. మిత్రపక్షాలు కొన్ని సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డీఎంకే.. కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలతో పొత్తుపెట్టుకుంది. అన్నాడీఎంకే.. బీజేపీ, విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీఎంకేలతోపాటు మరో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. 
 
ఇక, ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన శశికళ అక్క కొడుకు  టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే), సినీ నటుడు కమల్‌హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీతి మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) కూడా బరిలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చిన్నాచితక పార్టీలు బరిలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.