తుపాకీ గురిపెట్టి బెదిరించినా వెరవకుండా సివంగులైన తల్లీ కుమార్తె... దొంగలు పరార్!!
ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన కొందరు దండుగులు.. తుపాకీ గురిపెట్టి బెదిరించినప్పటికీ ఆ తల్లి, కుమార్తె మాత్రం శివంగులై వారికి ఎదురొడ్డి నిల్చొన్నారు. ఆ ఇద్దరు మహిళలు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు దోపిండీ దొంగలు తోక ముడిచి పారిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బేగంపెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్‌పుర జైన్ కాలనీ గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరరకు... నవరతన్ జైన్, ఆయన భార్య అమిత మేహోత్‌లు రసూల్ పురలోని పైగా హౌసింగ్ కాలనీలో ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అమిత, ఆమె కుమార్తె, పనిమనిషి ఇంట్లో ఉన్న సమయంలో ప్రేమ్ చంద్, సుశీల్ కుమార్ కొరియర్ సర్వీస్ వచ్చిందంటూ ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు.
వారిద్దరినీ తలుపు బయటే ఉండాలని అమిత చెప్పగా, హెల్మెట్ ధరించిన సుశీల్ కుమార్ ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి బ్యాగులోని నాటు తుపాకీ బయటకు తీసి గురిపెట్టాడు. ఆ తర్వాత ప్రేమ్ చంద్ వంట గదిలోకి వెళ్లి పని మనిషి మెడపై కత్తిపెట్టాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని వారిని బెదిరించారు. అదేసమయంలో సుశీల్‌ను అమిత బలంగా కాలుతో నెట్టింది. ఈ లోపు ఆమె కుమార్తె కూడా రావడంతో గట్టిగా ప్రతిఘటించారు.
దీంతో వారిద్దరిపైనా సుశీల్ దాడి చేస్తున్నప్పటికీ వెరవకుండా గట్టిగా కేకలు వేస్తూ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మరో గత్యంతరం లేక అతడు తుపాకీ వదిలి పారిపోయాడు. ఈలోపు తల్లీకుమార్తెల కేకలు విన్న ఇరుగుపొరుగువారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మరోవైపు, ప్రేమ్ చంద్ కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, స్థానికులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రేమ్ చంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పారిపోయిన సుశీల్‌ను కాజేపేటలో అరెస్టు చేశారు.
ఇద్దరు నిందితులు పథకం ప్రకారమే దోపిడీకి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసవిచారణ జరుపుతున్నారు.