ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 20 జులై 2017 (07:06 IST)

డీఐజీ రూప సామాన్యురాలు కాదు. కేంద్రంతో కలిసి శశికళ లగ్జరీలపై స్కెచ్ వేసింది

కర్ణాటక జైలులో శశికళ కోట్లు వెదజల్లి మరీ అనుభవించిన రాజభోగాల గుట్టు రట్టు కావడంలో మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం వేసిన స్కెచ్ కీలకపాత్ర పోషించిందని తెలిసింది. ఏ డిటెక్టివ్ నవలకు, క్రైమ్ స్టోరీకి, గూఢచార సినిమాకు తీసిపోని ఆపరేషన్ శశికళ పథకాన్ని వెల

కర్ణాటక జైలులో శశికళ కోట్లు వెదజల్లి మరీ అనుభవించిన రాజభోగాల గుట్టు రట్టు కావడంలో మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం వేసిన స్కెచ్ కీలకపాత్ర పోషించిందని తెలిసింది. ఏ డిటెక్టివ్ నవలకు, క్రైమ్ స్టోరీకి, గూఢచార సినిమాకు తీసిపోని ఆపరేషన్ శశికళ పథకాన్ని వెలికి తెచ్చిన ఘనత కర్ణాటక జైళ్ళ శాఖ డీఐజీ రూప మౌద్గిల్‌ది కాగా కేంద్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందిగా మూడు నెలలపాటు సాగించిన రహస్య దర్యాప్తు కీలకపాత్ర పోషించింది. జైల్లో లగ్జరీ వ్యవహారం కేంద్రానికి ఏప్రిల్‌లోనే తెలుసు, కేంద్రం స్కెచ్‌లో భాగంగానే మహిళా ఐపీఎస్ రూపను జైళ్ల శాఖకు పనిగట్టుకుని మార్చారని తెలుస్తోంది.
 
తీగలాగితే డొంకంతా కదులుతుందంటారు కదా.  ఆ విధంగానే పరప్పన అగ్రహార జైల్లో సాధారణ ఖైదీ శశికళ అసాధారణ సౌకర్యాలను అనుభవిస్తున్నట్లు జైళ్లశాఖ (మాజీ) డీఐజీ రూప కనుగొన్నారు. ఈ బాగోతం వెనుక  రూ.2 కోట్లు చేతులు మారినట్లు నిర్ధారించుకుని లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలైంది. అయితే శశికళ అడ్డంగా బుక్కయిపోవడానికి కర్ణాటక హోంశాఖ మాజీ మంత్రి పరమేశ్వర్‌ సహాయకుడు ప్రకాష్‌ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలమే ప్రధాన కారణం.
 
అది ఎలాగంటే.. అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం పొందడం కోసం ఎన్నికల కమిషన్‌కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ రూ.50 కోట్లు ఎరవేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి బ్రోకర్‌ సుకేష్‌కు రూ.10 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన సుకేష్‌ అనే బ్రోకరు ఢిల్లీలో క్రైం బ్రాంచ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. సుకేష్‌ వాగ్మూలంతో దినకరన్, ఆయన స్నేహితుడు బెంగళూరుకు చెందిన మల్లికార్జున్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేశారు. మల్లికార్జున్‌తో జరిపిన విచారణలో అతను హోంశాఖ మాజీ మంత్రి పరమేశ్వరన్‌ సహాయకుడు ప్రకాష్‌తో తరచూ సంభాషించినట్లు కనుగొన్నారు. 
 
ప్రకాష్‌ ద్వారానే రూ.10 కోట్ల హవాలా సొమ్ము ఢిల్లీ చేరినట్లు పోలీసులు తెలుసుకుని అతన్నిఢిల్లీకి పిలిపించుకుని విచారించారు. ఎన్నికల కమిషన్‌కు లంచంతో తనకు సంబంధం లేదని, అయితే దినకరన్‌ మాత్రం తెలుసని అంగీకరించాడు. అయితే బెంగళూరు జైలు అధికారులకు లక్షలాది రూపాయలు సరఫరా అవుతున్నట్లు తెలిపాడు. శశికళకు లగ్జరీ సౌకర్యాల కోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెప్పడంతో ఢిల్లీ పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
 
ప్రకాష్‌ ఇచ్చిన వాంగ్మూలాన్ని 306 చట్టం సెక్షన్‌ కింద నమోదు చేశారు. అంతేగాక ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు ఢిల్లీ పోలీసులు చేరవేశారు. ఆ తరువాత నుంచే శశికళ, ఆమె బంధువులపై గత మూడు నెలలుగా నిఘాపెట్టారు. శశికళకు జరుగుతున్న ప్రత్యేక మర్యాదలను తెలుసుకున్నారు. జైలు అధికారులు శశికళ నుంచి సొమ్ము తీసుకుంటున్నట్లు తేలింది. అయితే రెడ్‌హాండెడ్‌గా పట్టుకునేందుకు సీసీ టీవీ పుటేజీలను కేంద్రం సేకరించింది. ఇందుకోసం ఖైదీలనే వాడుకుంది. శశికళకు తెలియకుండా అంతా గోప్యంగా జరిపించింది. శశికళ మేకప్‌ సామాను, షాపింగ్‌ చేసిన దృశ్యాలను సైతం సేకరించింది. 
 
ఈ విషయంలో డీఐజీ రూప ప్రముఖ పాత్ర పోషించారు. బెంగళూరులో రూప ఇంటి పక్కనే కేంద్రమంత్రి ఒకరు నివసిస్తున్నారు. ఉదయం వేళ జాగింగ్‌ సమయంలో ఒకరోజు శశికళ లగ్జరీ జీవితాన్ని మంత్రికి చెప్పినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే రూపను జైళ్లశాఖ డీఐజీగా బదిలీచేసినట్లు కూడా చెబుతున్నారు. కాగా, శశికళకు సంబంధించి ఆధారాలు సేకరించిన ఖైదీలను ప్రస్తుతం అకస్మాత్తుగా వేరే జైలుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. జైలులోపల జరిగే చీకటి వ్యవహారాలను మూడు నెలలపాటు నిఘా పెట్టి మరీ కనుక్కున్న వైనం రాంగోపాల్ వర్మ దృష్టికి వెళితే 30 రోజుల్లోనే సినిమా తీసేయగలడు కూడా.