గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (06:28 IST)

సంక్రాంతికి కొత్త సీఎం.... 12న ప్రమాణ స్వీకారం చేయనున్న శశికళ!

సంక్రాంతి పండుగ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ కొత్త ముఖ్యమంత్రి ఎవరో కాదు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళా నటరాజన్. ఆమె ఈనెల 12వ తేదీన స

సంక్రాంతి పండుగ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ కొత్త ముఖ్యమంత్రి ఎవరో కాదు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళా నటరాజన్. ఆమె ఈనెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నాడీఎంకే నేతలు ఘంటాపథంగా చెపుతున్నారు. 
 
జయలలిత మరణించిన నాటి నుంచే శశికళ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అమ్మ మరణంతో ఖాళీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆమె చేపట్టారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని కూడా చిన్నమ్మకే కట్టబెట్టాలని పార్టీలోని అగ్రనాయకత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. పైగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆమెపై ఒత్తిడి పెంచుతున్నారు. 
 
వీరిలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై ముందువరుసలో ఉన్నారు. ఇతనికి మంత్రులు ఆర్‌పీ ఉదయకుమార్, కడంబూరు రాజా, సేవూరు రామచంద్రన్ తదితరులు జతకలిశారు. కొత్త ఏడాదిరోజున అమ్మ సమాధి వద్దకు వెళ్లి నివాళుర్పించిన మంత్రులు శశికళను కలుసుకుని సీఎం బాధ్యతలు స్వీకరించాలని కోరారు. మంత్రులు ఓఎస్‌ మణియన్, తంగమణి వీరికి వంత పాడారు. 
 
ఈ ప్రయత్నాలకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు, పార్టీ అగ్ర నేతలంతా సోమవారం సాయంత్రం పోయెస్‌గార్డెన్‌లో శశికళతో సమావేశమై మరోసారి ఒత్తిడి తెచ్చారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల నాటికి శశికళను సీఎం చేసి ఆమె నేతృత్వంలో శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని వారంతా భావిస్తున్నారు. ఇందుకోసం సంక్రాంతికి ముహుర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.