గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2016 (09:06 IST)

జయలలిత మరణం ఓ మిస్టరీ.. కోర్టు విచారణతోనే నిజాలు వెల్లడి : శశికళ పుష్ప

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలంటూ పదేపదే డిమాండ్ చేస్తూ వస్తున్న వారిలో అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పా ఒకరు. అమ్మ మృతిపై విచారణ కూడా జరిపించాలని ఆ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలంటూ పదేపదే డిమాండ్ చేస్తూ వస్తున్న వారిలో అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పా ఒకరు. అమ్మ మృతిపై విచారణ కూడా జరిపించాలని ఆమె సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. 
 
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజిఆర్‌ వర్థంతి సందర్భంగా శనివారం ఉదయం ఆమె మెరీనాబీచ్‌లో ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మృతి చెందటం వరకూ ఆమెకు జరిపిన చికిత్సలకు సంబంధించి స్పష్టమైన వివరాలు వెల్లడి కాకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 
 
జయలలిత మృతితో రాష్ట్ర రాజకీయాల్లో శూన్య పరిస్థితులు నెలకొన్నాయని, స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆమె ఆకస్మికంగా మృతి చెందటాన్ని సామాన్య ప్రజలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రస్తుతం పార్టీని శశికళ కుటుంబ సభ్యులు నడిపిస్తున్నారన్నారు. 
 
అదేసమయంలో జయలలిత మృతిపై విచారణ జరపాలని, ఆమెకు అందించిన చికిత్స వివరాలు వెల్లడించాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలై ఉండటంతో విచారణలోనైనా వాస్తవాలు తెలుస్తాయని ఆశిస్తున్నానని శశికళా పుష్ప తెలిపారు.