శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (20:22 IST)

ప్రధాని మోడీ ఎన్నిక చెల్లుతుందా? లేదా? తీర్పు రిజర్వు చేసిన సుప్రీం!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిక్కుల్లోపడేలా కనిపిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి స్థానం నుంచి విజయం సాధించారు. అయితే, ఈ స్థానం పరిధిలో నరేంద్ర మోడీకి ఓటు హక్కు లేదు. అందువల్ల ఆయన ఎన్నిక చెల్లదని పేర్కొంటూ సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) నుంచి డిస్మెస్ అయిన కానిస్టేబుల్ తేజ్ బహదూర్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
నిజానికి గత లోక్‌సభ ఎన్నికల్లో తేజ్ బహదూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేశారు. కానీ, ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. తేజ్ బహదూర్ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గ ఓటరు కాదని, ఎన్నికల కమిషన్‌కు తేజ్ బహదూర్ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ చర్య తీసుకుంది.
 
దీంతో ఆయన లక్నో హైకోర్టును ఆశ్రయించగా, అక్కడు కూడా ఆయనకు చుక్కెదురైంది. ఫలితంగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం... తీర్పును రిజర్వులో ఉంచింది. కాగా, తేజ్ బహదూర్ 2017లో విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సైనికులకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఈ వీడియోలో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు.