శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (12:00 IST)

ఉమాభారతికి కరోనా పాజటివ్ : దేశంలో 60 లక్షలకు చేరువలో కేసులు

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమాభారతికి కరోనా వైరస్ సోకింది. గత మూడు రోజులుగా స్వల్పం జ్వరంతో బాధపడుతున్న ఆమె కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాటిజివ్‌ అని తేలింది. అప్పటి నుంచి ఆమె హిమాచల్‌ప్రదేశ్‌లోని హరిద్వార్‌-రిషికేశ్‌ మధ్య వందేమాతరం కనౌజ్‌లో క్వారంటైన్‌లో ఉంటున్నారు. 
 
నాలుగురోజుల తర్వాత తాను మరోసారి కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటానని తిరిరి పాజిటివ్‌ వస్తే వైద్యులను సంప్రదిస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తనను ఈ మధ్య కలిసిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకొని క్వారంటైన్‌లో ఉండాలని కోరారు. ఇటీవల హిమాలయ పర్యటనకు వెళ్లిన ఆమె అన్ని కోవిడ్ -19 నిబంధనలు అనుసరించినా కరోనా పాజిటివ్ బారినపడటంపై బీజేపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. 
 
మరోవైపు, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువలో వచ్చాయి. గత 24 గంటల్లో దేశంలో 88,600 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 1,124 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 94,503కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 49,41,628 మంది కోలుకున్నారు. 9,56,402 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
              
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,12,57,836 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,87,861 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
ఇంకోవైపు, తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,967 పాజిటివ్‌ కరోనా కేసులు నమోదుకాగా కోవిడ్‌ బారినపడిన వారిలో 2,058 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 9 మంది మృత్యువాతపడ్డారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,85,833 మంది కరోనా బారినపడగా 1,54,499 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 30,234 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 24,607 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా 1,100 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
కోవిడ్‌ మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.939 శాతంగా ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 50,108 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 28,50,869 టెస్టులు పూర్తిచేసినట్లు వివరించింది.