శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (08:46 IST)

తెలంగాణా బీజేపీలో కరోనా కలకలం.. స్వీయ నిర్బంధంలోకి నేతలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఆ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పీకే కృష్ణదాస్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణదాస్‌కు కరోనా అని తెలియడంతో తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. 
 
కాగా, కృష్ణదాస్‌తో బండి సంజయ్ మంగళవారం సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కృష్ణదాస్‌కు కరోనా పాజిటివ్ అంటూ మెడికల్ రిపోర్టు వచ్చింది. దాంతో, బండి సంజయ్ 5 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. 
 
నాలుగు రోజుల కిందట ఢిల్లీ వెళ్లినప్పుడు కరోనా టెస్టులు చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో తన పరిస్థితిని వివరిస్తూ బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమాచారం అందించారు. ఇప్పటికే తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. మంగళవారం వెల్లడించిన వైద్య బులిటెన్ మేరకు గడచిన 24 గంటల్లో 69 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 10 మంది బలయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,041కి పెరిగింది.
 
అలాగే, తాజాగా 8,846 పాజిటివ్ కేసులు వచ్చాయి. 9,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,925కి పెరిగింది. మొత్తమ్మీద 4,86,531 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 92,353 మంది చికిత్స పొందుతున్నారు.