చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్
ఇటీవల చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగిన విషయం తెల్సిందే. ఆయన తల్లి మంగతాయారు(85) అనారోగ్యంతో నారాయణగూడలోని కూతురు నివాసంలో శుక్రవారం రాత్రి పరమపదించారు. దీంతో స్వామినితెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పరామర్శించారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్‌ను కలిసి కేసీఆర్ సానుభూతి తెలిపారు. కేసీఆర్‌తో పాటు మైంహోం రామేశ్వరరావు ఉన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి పరామర్శించారు.
అలాగే, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం చినజీయర్ స్వామితో ఫోనులో మాట్లాడారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చినజీయర్ స్వామిలో ధార్మిక, సామాజిక దృష్టి కలగడానికి ఆయన మాతృమూర్తి కీలక పాత్ర పోషించారన్నారు. సంప్రదాయ మధ్యతరగతి గృహిణిగా పిల్లల జీవితాలను చక్కగా తీర్చిదిద్దిన తీరు అందరికీ ఆదర్శప్రాయమని వెంకయ్య కొనియాడారు.
అలాగే, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు కూడా చినజీయర్ స్వామిని పరామర్శించిన వారిలో ఉన్నారు.