జాతీయ పార్టీలతో సై.. కేసీఆర్ కొత్త పార్టీ ఖరారు చేశారా? అధ్యక్ష తరహా ఎన్నికలొస్తే?  
                                       
                  
				  				  
				   
                  				  జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు రాణించలేవా..? జాతీయ పార్టీలే ఎర్రకోటలో పాలన సాగించాలా ? అనే ప్రశ్నకు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అంత సీన్ లేదంటున్నట్లు సమాచారం.
				  											
																													
									  2024 ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే పార్టీగా... నయా భారత్ అనే పార్టీని కేసీఆర్ స్థాపించబోతున్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. పార్టీ పేరును ఇప్పటికే కేసీఆర్ ఖరారు చేశారని తెలుస్తోంది. అలాగే పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 
				  
	 
	గతంలో 2019 ఎన్నికల్లో కూడా కేసీఆర్.. జాతీయ బీజేపీ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలూ 70 ఏళ్లుగా దేశాన్ని ఏం అభివృద్ధి చేశాయని ప్రశ్నించారు. తద్వారా జాతీయ స్థాయిలో మూడో కూటమి (ఫెడరల్ ఫ్రంట్) అధికారంలోకి రావాల్సిందే అనే సందేశం ఇచ్చారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  ఇలాంటి సమయంలో సమయం కూడా తక్కువగా ఉండటంతో కేసీఆర్ పావులు కదపలేకపోయారు. అయితే ప్రస్తుతం పక్కా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
				  																		
											
									  
	 
	ఇప్పటికే తన కొడుకు, మంత్రి కేటీఆర్ ద్వారా... ప్రభుత్వ కార్యకలాపాల్ని ముందుకు నడిపిస్తున్న కేసీఆర్... ఈ మధ్య పెద్దగా మెయిన్ పాలిటిక్స్‌లో కనిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం... ఆయన తెరవెనక జాతీయ స్థాయి పాలిటిక్స్‌పై దృష్టి సారించడమేనని టీఆర్ఎస్ శ్రేణుల సమాచారం. 2022 లేదా 2023లో జమిలి ఎన్నికలకు వెళ్లాలనుకున్నా ఈ కరోనా పరిస్థితుల్లో అది వీలవుతుందా లేదా అనే అనుమానం ఉంది. 
				  																	
									  
	 
	జమిలి ఎన్నికలు జరిగినా, లేక... సాధారణ ఎన్నికలు 2024లో జరిగినా... దేనికైనా సిద్ధంగా ఉండేలా కేసీఆర్.. పక్కాగా స్కెచ్ వేస్తున్నారని తెలుస్తోంది. దేశంలో అధ్యక్ష తరహా ఎన్నికలకు కేంద్రం ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని పరిశీలించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అధ్వర్యంలో ఓ కమిటీని వేసింది. 
				  																	
									  
	 
	ఒకవేళ అధ్యక్ష తరహా పాలన అమల్లోకి వస్తే... పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలే పోటీ చేయగలవు. ప్రాంతీయ పార్టీలు... అసెంబ్లీలకే పరిమితం అవుతాయి. 
				  																	
									  
	 
	అందువల్లే కేసీఆర్... జాతీయ స్థాయి పార్టీని పెట్టబోతున్నట్లు తెలిసింది. కేసీఆర్ సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తారా? లేక కలిసొచ్చే ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటారా అన్నది ఇంకా తేలలేదు.