గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:50 IST)

ఇవేం టెస్టు ఫలితాలో.. ఢిల్లీలో పాజిటివ్.. జైపూర్‌లో నెగెటివ్... ఎంపీ గగ్గోలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు సభ్యులందరికీ విధిగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 30 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, ఓ సభ్యుడు మాత్రం వింత పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎందుకంటే.. ఈయన ఢిల్లీలో కరోనా పరీక్ష చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. ఇక చేసేదేంలేక తిరిగి స్వరాష్ట్రానికి వెళ్లారు. అక్కడ మరో ప్రైవేటు ఆస్పత్రిలో ఈ పరీక్ష చేయించాడు. కానీ, ఫలితం మాత్రం నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆయన ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు. 
 
రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన లోక్‌సభ సభ్యుడు హనుమాన్ బెనీవాల్‌కు ఢిల్లీలో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన సభకు హాజరుకాకుండా, స్వరాష్ట్రానికి చేరుకుని, జైపూర్‌లో మరోసారి పరీక్ష చేయించుకోగా నెగటివ్ వచ్చింది. తాను వ్యాధి బారిన పడలేదని ట్విట్టర్ ద్వారా పేర్కొన్న ఆయన, ఆ రిపోర్టు కాపీలను కూడా పోస్ట్ చేశారు. ఈ రెండింటిలో దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో తనకు అర్థం కావడం లేదని, తన మనసు అయోమయంలో పడిపోయిందంటూ ట్వీట్ చేశారు.
 
ఇక ఆయన ట్వీట్‌ను చూసిన నెటిజన్లు, ఇప్పటివరకూ సామాన్యులకు మాత్రమే ఇటువంటి తిప్పలు పరిమితం అయ్యాయని, ఇప్పుడు ఓ ఎంపీకి కూడా ఇదే పరిస్థితి ఎదురైందని కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ నెల 11న హనుమాన్ బెనీవాల్ ఇచ్చిన నమూనాలను పరిశీలించిన వైద్యులు 12న పాజిటివ్ అని ఇచ్చారు. ఇది ఐసీఎంఆర్ చేసిన పరీక్ష. ఆపై 13వ తేదీన ఆయన జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ అఆసుపత్రిలో ఇచ్చిన నమూనా ఫలితం నెగటివ్‌గా రావడం గమనార్హం.