గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (15:47 IST)

తమిళనాడు రైతులకు ఎన్నికల తాయిలం రుణమాఫీ!

తమిళనాడు రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి భావిస్తున్నారు. ఇందుకోసం ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్నారు. తాజాగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఇందుకోసం రూ.12,110 కోట్లను కేటాయిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న దాదాపు 16.43లక్షల మంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం దక్కనుంది.
 
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో పలు పథకాలకు అన్నాడీఎంకే ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా రైతు రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పథకం వెంటనే అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీనికి అవసరమైన నిధులను తమ ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుందన్న ఆయన తెలిపారు. 
 
రైతు రుణమాఫీనే కాకుండా మరిన్ని నూతన సంక్షేమ పథకాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ డీఎంకేపై మండిపడ్డ ఆయన, రెండు ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించి అమలులో విఫలమైందని ప్రతిపక్షపార్టీపై విమర్శలు గుప్పించారు.