గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (07:14 IST)

నేను గెలిస్తే చంద్రమండలం ట్రిప్, హెలికాప్టర్, ఇంటింటికి రోబో, ఐఫోన్ ఇస్తా..!: శరవణన్

Thulam Saravanan,
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ మదురై నుంచి పోటీ చేస్తున్న శరవణన్‌ ఇస్తున్న ఎన్నికల హామీలు విని జనం నవ్వుకుంటున్నారు. ఇన్ని హామీలు ఇచ్చిన శరవణన్‌ తన నామినేషన్‌ సమయంలో డిపాజిట్‌ కోసం అప్పు చేశారు. అయితే ఈ హామీలతో అందరి దృష్టి అతనిపై పడింది. రాజకీయ పార్టీలు అడ్డగోలుగా ఇచ్చే హామీలపై ప్రజలకు అవగాహన కల్పించడానికే తాను వింత హామీలు ఇచ్చినట్టు శరవణన్‌ చెప్పారు. 
 
తన నియోజకవర్గం కోసం స్పెషల్ మేనిఫెస్టోను రూపొందించారు. ఇతకి సదరు అభ్యర్థి ఏయే హామీలిచ్చారంటే..నియోజకవర్గ ప్రజలందరిని బ్యాచ్‌ల వారీగా చంద్రమండలానికి తరలించడం. స్థానికంగా రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయడం. ఇళ్లలో ఆడవాళ్లకు పనిలో సాయంగా ఉండేందుకు ఇంటింటికీ ఓ రోబోను పంపిణీ చేయడం. మధురైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కాలువలు తవ్వించడమే కాకుండా.. ఇంటికో బోటు ఇవ్వడం వంటివి. 
 
అంతేకాకుండా.. ఎండవేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ మంచుకొండ నిర్మాణం. ప్రజలు ఎంజాయ్ చేయడానికి కృత్రిమ సముద్రాన్నే సృష్టించి బీచ్ నిర్మాణం. నియోజకవర్గ ప్రజలందరికీ ఐఫోన్ కూడా ఇస్తానని శరవణన్ ప్రకటించారు. 
 
తొలుత శరవరణ్ పలు రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఎవ్వరూ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలకు పోటీ ఇచ్చేందుకు నమ్మశక్యం కాని హామీల వర్షం కురిపించాడు. ఇప్పటికే హామీల వర్షం కురిపిస్తున్నాయి అక్కడి పార్టీలు.. అలాంటి చోట స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన హామీ అందరినీ షాక్‌ గురి చేస్తోంది. ప్రస్తుతం శరవణన్ ఇచ్చిన హామీలు ఎన్నికల ప్రచారంలో వైరల్ అవుతున్నాయి.
 
మరి మధురై ప్రజలు శరవణన్ మాటలు నమ్ముతారా..? లేక అందరిలాగానే ఫ్రీ హామీలిస్తున్నాడని లైట్ తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా.. ప్రధాన పార్టీలిచ్చిన షాక్ తో డీలా పడకుండా.. వారికి రివర్స్ కౌంటర్ ఇచ్చేలా శరవణన్ హామీలిచ్చాడని రాజకీయ నేతలంటున్నారు. మరి చంద్రమండలం టూర్, రోబోలు, మంచుకొండలు, పడవలు, ఐఫోన్లు మనోడికి ఓట్లు రాల్చుతాయో లేదో అనేది వేచి చూడాలి.