తమిళనాడులో 20 నుంచి కర్ఫ్యూ - ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా, ఈ నెల 20వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి వేకువజామున 4 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి వేళల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజా రవాణా, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలను అనుమతించరు.
అదేసయమంలో ప్రతి ఆదివారం రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తారు. నిత్యవసర షాపులు, మెడికల్ షాపులు మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు. రెస్టారెంట్లు ఉదయం 6 నుంచి 10, మధ్యాహ్నం 12 నుంచి 3, సాయంత్రం 6 నుంచి 9 గంటలు మాత్రమే పనిచేస్తాయని, అదీ కూడా హోం డెలివరికీ వరకు మాత్రమే వీలు కల్పించారు. పనిలోపనిగా 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం యథాతధంగా కొనసాగుతాయని తెలిపింది.
అయితే, నిరంతరం నడవాల్సిన పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్‌లకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. రాష్ట్రంలోని ఊటీ, కొడైకెనాల్, యార్కాడ్ వంటి అన్ని రకాల పర్యాటక కేంద్రాలతో పాటు మ్యూజియాలు, పార్కులు, జూలు ఇతర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండే ప్రదర్శనశాలలన్నీ మూసి ఉంటాయి. పెళ్లిళ్లకు 100 మంది, అంత్యక్రియలకు 50 మందిని అనుమతించనున్నారు.