గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (15:02 IST)

కరెన్సీ నోట్లు - ఫోన్‌ స్క్రీన్లపై కరోనా వైరస్ ఒకసారి చేరితే.. ఎన్ని రోజులు ఉంటుందంటే...

ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ సాధారణ ప్రజల నుంచి కోటీశ్వరులు, సెలెబ్రిటీల వరకు ఈ వైరస్ బారినపడుతున్నారు. వీరిలో ఆరోగ్యవంతులుగా ఉండేవారు కోలుకుంటుంటే.. అనారోగ్యులు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
అంతేకాకుండా, ఈ వైరస్ భయం కారణంగా ఏది ముట్టుకోవాలన్నా... పట్టుకోవాలన్నా ప్రజలు భయంతో చచ్చిపోతున్నారు. బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లోని బెంచీలపై కూర్చొనేందుకు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తున్నారు. అంటే కంటికి కనిపించని ఈ వైరస్ ఏమూల మాటు వేసి ఉందో తెలియక ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది.
 
అయితే, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ డబ్బులు ముట్టుకోక, సెల్‌ఫోన్ పట్టుకోక తప్పదు. వీటిపై ఒకసారి చేరిన వైరస్ ఎంతకాలం జీవించి ఉంటుందన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ, ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ తాజా పరిశోధనలో మాత్రం కొంత ఆందోళన కలిగించే అంశాలు వెలుగుచూశాయి.
 
కరెన్సీ నోట్లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులపై కరోనా వైరస్ చేరితే అది 28 రోజుల వరకు జీవించి ఉంటుందన్నదే ఆ పరిశోధన సారాంశం. దీంతో నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులను కూడా తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని, వాటిని పట్టుకున్న ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవాలని పరిశోధకులు సూచించారు. తక్కువ ఉష్ణోగ్రతలో వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుందని, సున్నితంగా ఉండే ఉపరితలాలపై అది మరింత ఎక్కువకాలం జీవించి ఉంటుందని పేర్కొన్నారు. 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా వైరస్ 28 రోజులపాటు మనుగడ సాధిస్తుందని గుర్తించినట్టు వివరించారు.