సేవ్ ఏపీనా...? సేవ్ టీడీపీనా? హోదాపై మింగుడు పడని తెలుగు తమ్ముళ్ళు!
న్యూఢిల్లీ : ప‌్రత్యేక హోదా ఇచ్చేది లేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెగేసి చెప్పిన నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీలు విధిలేక రోడ్డెక్కారు. ఢిల్లీలో తమ నిరసన వ్యక్తం చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంటు ఆవరణలో తేదేపా ఎంప
న్యూఢిల్లీ : ప‌్రత్యేక హోదా ఇచ్చేది లేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెగేసి చెప్పిన నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీలు విధిలేక రోడ్డెక్కారు. ఢిల్లీలో తమ నిరసన వ్యక్తం చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంటు ఆవరణలో తేదేపా ఎంపీలు సేవ్ ఏపీ, వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, భాగస్వామ్య పక్షమైన బీజేపీ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీనే తాము నెరవేర్చమంటున్నామని ఎంపీలు పేర్కొంటున్నారు.
ప్రత్యేక హోదా ఏపీకి ఇపుడు సెంటిమెంట్‌గా మారిందని, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ హోదా లేదని చెప్పేశాక ఇక తాము ఏపీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితికి చేరిపోయామని తెలుగుదేశం ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క బీజేపీకీ ఇరకాట పరిస్థితి ఏపీలో ఎదురవుతోంది. కానీ, అంతకుమించి టీడీపీ నలిగిపోయే పరిస్థితి ఏపీలో ఉంది. హోదా చంద్రబాబు తేవాల్సిందే... లేకుంటే, ఆయన ఇంటి ముందే ఆత్మహత్యకు పాల్పడతా అంటూ, సీనీ హీరో శివాజి వంటి వారు అల్టిమేటం ఇవ్వడం ఒక ఎత్తు అయితే, హోదా విషయంలో తాము ప్రైవేటు బిల్లు పెట్టి ఏపీ ప్రజలకు ఎంతో మేలు చేయబోయామని, దానిని బీజేపీ, టీడీపీలు అడ్డుకున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు.
ఈ మాటలు చెపుతూ తిరిగి ఏపీలో కాంగ్రెస్ అనుకూల పవనాల కోసం గట్టి ప్రయత్నాలను ఇప్పటికే మొదలు పెట్టేసింది. ఇక వైసీపీ అయితే, ఏకంగా ఆగస్టు 2న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. జగన్ ఇపుడు ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలపై విరుచుకుపడేందుకు తయారైపోయారు. ఈ పరిస్థితిలో ఏపీలో టీడీపీని సేవ్ చేసుకోవడానికి సేవ్ ఏపీ అంటూ టీడీపీ ఎంపీలు ఢిల్లీలో నిరసనకు దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది.