గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (15:07 IST)

సంప్రదాయమే గొప్పది.. చట్టం కాదు: ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన ప్రబుద్ధుడు

తమ సంప్రదాయమే ముఖ్యమని, చట్టం గొప్పది కాదనీ ఓ ప్రబుద్ధుడు తేల్చిచెప్పాడు. అంతేనా.. తన భార్యకు ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. పైగా, వాట్సాప్‌లోనూ సందేశం పంపించాడు. దీంతో అతనిపై ట్రిపుల్ తలాక్ చట్టం మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానేకు చెందిన ఓ మహిళను అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెను  భర్త విడిచిపెట్టి వెళ్లాడు. ఆ తర్వాత మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 
 
భార్య బాగోగులు లేదా కుటుంబ పోషణ ఏమాత్రం పట్టించుకోని ఆ ప్రబుద్ధుడు... ఇటీవల భార్యకు ఫోన్ చేసి.. తలాక్.. తలాక్.. తలాక్ అంటూ మూడుసార్లు చెప్పి, తెగదెంపులు చేసుకున్నారు. పైగా, ట్రిపుల్ తలాక్ సందేశాన్ని వాట్సాప్ ద్వారా కూడ పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 
 
నిజానికి ట్రిపుల్ తలాక్‌ చెప్పడం నేరంగా పరిగణిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలుపగా, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో ఇది చట్టరూపం దాల్చింది. 
 
ఇలాంటి నేపథ్యంలో ఆ ప్రబుద్ధుడుపై ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ చట్టం-2019 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికింద ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తలకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకూ జైలుశిక్ష పడనుంది.